జ్యోతిష్యుడిని కలిసిన క్వీన్

30 Mar, 2016 14:23 IST|Sakshi
జ్యోతిష్యుడిని కలిసిన క్వీన్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్తో వివాదాలతో పాటు, తన లేటెస్ట్ సినిమాతో మరోసారి నేషనల్ అవార్డ్ సాధించి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న కంగనారనౌత్.., మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ బోల్డ్ బ్యూటీ తన భవిష్యత్తును తెలుసుకునేందుకు ఓ జ్యోతిష్యుడిని కలిసిందట. ఎప్పటిలోగా తను సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటుందో తెలుసుకునేందుకే జ్యోతిష్యుడిని కలిసిందన్న టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, మనాలీ సమీపంలోని మండీలో ఇల్లు కట్టిస్తున్న కంగనా, అక్కడికి సమీపంలోనే జోగీందర్ నగర్లో ఉండే పండిట్ను కలిసింది. కొన్ని గంటలపాటు అతనితో చర్చించిన క్వీన్, ఎప్పటిలోగా తనకంటూ ఓ కుటుంబం ఏర్పడుతుంది, తన తల్లి ఆరోగ్యం ఎలా ఉంటుంది, భవిష్యత్తులో తన సినిమాలకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది లాంటి విషయాలను అడిగి తెలుసుకుంది.

గతంలో పలు ఇంటర్య్వూలలో జ్యోతిష్యం పై తనకు నమ్మకం ఉన్నట్టుగా ప్రకటించిన కంగనా, చాలా సార్లు జ్యోతిష్యులను సంప్రదించినట్టుగా తెలిపింది. అంతేకాదు అలా భవిష్యత్తు తెలుసుకోవటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఇతరులు కూడా ప్రయత్నించవచ్చని చెపుతోంది. తన సినిమా రిలీజ్ డేట్లతో పాటు టైటిల్ ఎంపికలో కూడా జ్యోతిష్యులను సంప్రదిస్తానని తెలిపింది కంగనా రనౌత్.