యాక్షన్‌... కట్‌

8 Jun, 2020 06:32 IST|Sakshi

కథానాయికగా తన ప్రతిభను చాటుకున్న కంగనా రనౌత్‌ ఇప్పుడు దర్శకురాలిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’లో టైటిల్‌ రోల్‌ చేసిన ఆమె ఆ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘అపరాజిత అయోధ్య’ సినిమాతో పూర్తి స్థాయి దర్శకురాలిగా యాక్షన్, కట్‌ చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు కూడా. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. రామమందిరం కేసు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్‌ సమాచారం. ఈ విషయంపై కంగనా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు ముందు నేను డైరెక్టర్‌గా ఉండాలనుకోలేదు.

కేవలం కాన్సెప్ట్‌ లెవల్‌లో మాత్రమే ఇన్‌వాల్వ్‌ అయ్యాను. నేను నిర్మాతగా వేరొకరి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నాను. కానీ విజయేంద్రప్రసాద్‌గారు అద్భుతమైన కథను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు నాతో అసోసియేట్‌ అయినవారు నేను డైరెక్ట్‌ చేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. హిస్టారికల్‌ మూవీ ‘మణికర్ణిక’ చిత్రం డైరెక్షన్‌లో నా వంతు భాగం ఉంది. ‘అపరాజిత అయోధ్య’ను డైరెక్ట్‌ చేయడానికి ఆ అనుభవం ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నారు. ఇక నటిగా ‘తలైవి’ (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం), ‘థాకడ్‌’, ‘తేజస్‌’ అనే చిత్రాలు కంగనా చేతిలో ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు