‘అలాంటి వారిని గాడిద మీద ఊరేగించాలి’

16 Feb, 2019 09:08 IST|Sakshi

ఇక మీదట శాంతి, అహింస అని ఎవరైనా మాట్లాడితే వారిని గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి అంటున్నారు నటి కంగనా రనౌత్‌. గురువారం పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ అమానవీయ చర్యను ప్రపంచదేశాలన్ని ముక్తకంఠంతో ఖండించాయి. బాలీవుడ్‌ కూడా ఉగ్రచర్యలను తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కూడా ఉగ్రదాడిని ఖండించారు. జవాన్ల మృతికి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘పాక్‌ మన దేశ భద్రతనే కాకుండా మన మర్యాదను కూడా గేళి చేసింది. మనకు హాని కలిగించడమే కాక అవమానించింది కూడా. ఇందుకు తగిన సమాధానం చెప్పాలి. ఈ పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండకూడదు. మన సహనాన్ని వారు చేతకానితనంగా భావిస్తున్నారు. ఫలితంగా ఈ రోజు దేశం రక్తమోడుతోంది. మన బిడ్డలను చంపి మనల్ని సవాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరైనా శాంతి, అహింస అంటే అలాంటి వారి ముఖానికి నల్లరంగు పూసి.. గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించాలి. నడి వీధిలో నిల్చోబెట్టి చెంప పగలకొట్టాలం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ల మృతికి సంతాపంగా కంగనా మణికర్ణిక సక్సెస్‌ మీట్‌ కార్యక్రమాన్నికూడా వాయిదా వేశారు.

>
మరిన్ని వార్తలు