5 Jan, 2019 00:35 IST|Sakshi
కంగనా రనౌత్‌

ఝాన్సీ బాయ్‌లా నీకూ పరీక్షలే అన్నారు

చిన్నప్పుడు తమ్ముడికి ఆడుకునే గన్ను తనకు బొమ్మ కొనిచ్చినప్పుడు ‘నేనెందుకు గన్నుతో ఆడుకోకూడదు. ఎందుకీ వివక్ష’.. ప్రశ్నించింది కంగనా రనౌత్‌. స్త్రీ ఎందులోనూ తక్కువ కాదని చిన్ని మనసులో నాటుకుపోయింది. పెరిగే కొద్దీ ఆ భావన పెరిగి పెద్దదైంది. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఎలాంటి బ్యాగ్రౌండూ లేకుండా బాలీవుడ్‌కి వచ్చి స్టార్‌ అయింది. ‘తను వెడ్స్‌ మను, రజ్జో, క్వీన్‌’ చిత్రాలతో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు ‘మణికర్ణిక: ఝాన్సీ రాణి’గా రాబోతోంది. ఈ చిత్రం తెలుగు  ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన సందర్భంగా కంగనా ఇంటర్వ్యూ..


► స్క్రిప్ట్‌ దశ నుంచి షూటింగ్‌లో, ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయిన నేపథ్యంలో సాగిన ‘మణికర్ణిక’ ప్రయాణం మీకెలా అనిపించింది?
చాలా దశలు చూశాను. విజయేంద్రప్రసాద్‌గారైతే ఆ ఝాన్సీ లక్ష్మీబాయ్‌ ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమా కూడా నిన్ను చాలా పరీక్షలు పెడుతోందన్నారు. అది నిజమే. ఈ చిత్రం షూటింగ్‌లో గాయపడ్డాను. ఆ తర్వాత అనుకోకుండా డైరెక్టర్‌గా మారాల్సి వచ్చింది. సినిమాల్లో యుద్ధ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రతి పరీక్షను దాటుకుంటూ వచ్చాను.

► కథ విన్నాక ఈ సినిమా కోసం మీరు ఏమేం నేర్చుకున్నారు?
కత్తి సాము నేర్చుకున్నాను. ఒకే కరవాలంతో కాదు.. కొన్ని సన్నివేశాల్లో రెండు కత్తులు దూస్తాను. దానికోసం చాలా ప్రాక్టీస్‌ చేశాను. కత్తిసాము, గురప్రు స్వారీలో పర్ఫెక్షన్‌ తీసుకురావడానికి రెండు నెలలు కష్టపడ్డాను. ఝాన్సీ లక్ష్మీ బాయ్‌ శక్తివంతమైన స్త్రీ. నేను కూడా చూడ్డానికి అంతే పవర్‌ఫుల్‌గా కనిపించాలి. అందుకు తగ్గట్టుగా నా బాడీ లాంగ్వేజ్‌ మార్చుకున్నాను. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న మంచి పీరియాడికల్‌ మూవీ ‘మణికర్ణిక’. ఫస్ట్‌ ఉమెన్‌ యాక్షన్‌ మూవీ. అందుకే రాజీపడలేదు.

► లక్ష్మీ బాయ్‌ వీర వనిత. బ్యాగ్రౌండ్‌ లేని స్థాయి నుంచి స్టార్‌గా ఎదిగే క్రమంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మహిళలందరూ ధైర్యంగా ఉండాలి కదా?
కచ్చితంగా ఉండాలి. రాణీ లక్ష్మీ బాయ్‌లాంటి వాళ్లను సమాజం తయారు చేయడానికి ముందుకొస్తే కాదనేవారు ఎవరుంటారు? అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి అని ఎవర్నీ ఒత్తిడి చేయకూడదు. ధైర్యవంతులను నిరుత్సాహపరచకూడదు.

► ఓకే.. ‘మణికర్ణిక’ని పూర్తి చేయడానికి డైరెక్షన్‌ సీట్‌లోకి రావాలన్నది మీ ఆలోచనా? అసలు ఏం జరిగింది?
క్రిష్‌గారు ఓ తెలుగు సినిమా ఒప్పుకోవడం వల్ల ‘మణికర్ణిక’ వాయిదా పడే పరిస్థితి వచ్చింది. మేం ఎలాగైనా జనవరిలోనే విడుదల చేయాలనుకున్నాం. దాంతో నిర్మాత కమల్‌ జైన్, రచయిత విజయేంద్రప్రసాద్‌గారు నన్నే డైరెక్షన్‌ చేయమన్నారు. అయితే ఇది ఈజీ మూవీ కాదు. ఒక చరిత్ర. అందుకే వేరే ఇద్దరు డైరెక్టర్లు పెట్టమన్నాను. అలా చేసినా సింక్‌ అవ్వలేదు. ఫైనల్లీ నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే అప్పటికే క్రిష్‌ చేసి ఉండటంతో మిగతా నాకు కొంచెం సులువు అయింది.

► క్రిష్‌ అలా తప్పుకోవడం కరెక్టేనంటారా? పైగా ‘మణికర్ణిక’ గురించి ఆయన ఎక్కడా మాట్లాడటంలేదు కూడా?
ఒక పెద్ద ప్రాజెక్ట్‌ ఒప్పుకున్నారు కాబట్టే తప్పుకున్నారు. వాయిదా వేయడానికి ఇష్టం లేక మేం పూర్తి చేశాం. ఇక ఈ సినిమా గురించి ఆయన ఎందుకు మాట్లాడటంలేదు అంటే.. ఆయన చేస్తున్న ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టి ఉంటారు.

► మీరు దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంవల్లే.. ఒక లేడీ డైరెక్టర్‌తో చేయడంతో ఇష్టం లేక సోనూ సూద్‌ తప్పుకున్నారట. కానీ ఆయనేమో గెటప్‌లో వచ్చిన మార్పు వల్లే అంటున్నారు?
గెటప్‌ మారినది నిజమే. సోనూ సూద్‌ ‘సింబా’ సినిమా ఒప్పుకున్నారు. ఆ సినిమా గెటప్‌కీ, దీనికీ సింక్‌ అవ్వదు. ఇందులో గడ్డం ఉండాలి. కానీ గడ్డం పెంచలేనంటూ తప్పుకున్నారు. అయినా ఇవాళా రేపూ గడ్డం గెటప్‌ అంటే పెంచాల్సిన అవసరమే లేదు. కావాలంటే పెట్టుడు గడ్డంతో మ్యానేజ్‌ చేయొచ్చు. కానీ సోనూ సూద్‌ తప్పుకున్నారు. అయినా ఓకే.

► మరో సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారట?
అవును. ఆ సినిమాకి విజయేంద్రప్రసాద్‌గారే కథ అందిస్తున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లు ఇది ఏలియన్స్‌కి సంబంధించిన కథ కాదు.

మరిన్ని వార్తలు