నలుగురు రాణులు.. నలభై రోజులు... ఒకటే కహానీ!

2 Nov, 2017 00:38 IST|Sakshi

కథొక్కటే... కథానాయికలు మాత్రం వేర్వేరు! కంట్రీ ఒక్కటే... కెమెరాలు కదిలే ప్రదేశాలు మాత్రం వేర్వేరు! నిర్మాత ఒక్కరే... దర్శకులు మాత్రం వేర్వేరు! కానీ, అందరూ స్నేహితులే! చిత్రీకరణ పూరై్తన తర్వాత కలిసే చోటు ఒక్కటే! సిన్మా కథ కాదిది... అంతకు మించిన కహానీ!

‘ఒక్క కథ... ఇద్దరు దర్శకులు... నలుగురు రాణులు!’ కథేంటో మీరూ లుక్కేయండి! హిందీ హిట్‌ ‘క్వీన్‌’లో కంగనా రనౌత్‌ కుమ్మేశారు. ఇప్పుడీ సిన్మాను దక్షిణాది భాషల్లో మెడియంటే ఫిల్మ్స్‌ పతాకంపై ప్రముఖ మలయాళ దర్శకుడు కె.పి. కుమారన్‌ తనయుడు, నిర్మాత మనుకుమారన్‌ రీమేక్‌ చేస్తున్నారు. సారీ... రీమేక్‌ కాదు, రీమేక్స్‌! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో! ఇందులో తెలుగు–మలయాళ వెర్షన్స్‌కు ‘షో, మిస్సమ్మ’ సిన్మాల ఫేమ్‌ నీలకంఠ, తమిళ–కన్నడ వెర్షన్స్‌కు నటుడు రమేశ్‌ అరవింద్‌ దర్శకులు. తెలుగులో తమన్నా, తమిళంలో కాజల్, కన్నడలో పరుల్‌ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్‌ నాయికలుగా నటిస్తున్నారు. అంటే... కంగనా రనౌత్‌ పాత్రను ఈ నలుగురూ చేస్తున్నారు.

తెలుగులో ‘క్వీన్‌’గా నటిస్తున్న తమన్నా తమిళ ప్రేక్షకులకు, తమిళ ‘క్వీన్‌’గా నటిస్తున్న కాజల్‌ తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఫేమ్‌ మంజిమాయే మలయాళ ‘క్వీన్‌’. తమిళ సినిమాలు కొన్నిటిలో ఆమె నటించారు. కన్నడ ‘క్వీన్‌’ పరుల్‌ యాదవ్‌ ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’తో తెలుగు–తమిళ ప్రేక్షకులకు తెలుసు. మలయాళ సినిమాలూ చేశారామె. అందువల్ల, ఎవరెలా చేస్తారోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది! ఈ ఆసక్తిని పెంచుతూ... ప్యారిస్‌లో మన నలుగురు ‘క్వీన్స్‌’ ఈ రోజు కంగనా రనౌత్‌ షూస్‌లో అడుగులేశారు. నాలుగు సినిమాల షూటింగులు నేడు ప్యారిస్‌లో మొదలయ్యాయి. దాదాపు 40 రోజుల పాటు అక్కడే జరుగుతాయి.

అయితే... లొకేషన్లు వేర్వేరులెండి! కానీ, షూటింగ్‌ తర్వాత అందరూ ఉండేది ఓ హోటల్‌లోనే. ‘ఓ ఒరలో రెండు కత్తులు ఇమడవు’ అని ఓ సామెత. ఇక్కడ రెండు కాదు... నాలుగు! అదేనండి.. కత్తిలాంటి కథానాయికలు నలుగురున్నారు. ఒకే సినిమాలో నటించకపోయినా ఒకే చోట, ఒకే లొకేషన్లో ఉంటారు కాబట్టి, నలుగురికీ గొడవలు వస్తాయేమో? అనే డౌట్‌ చాలామందికి ఉంది. నో... అటువంటి చాన్సే లేదంటున్నారు తమన్నా.

యాక్చువల్లీ... చిత్రీకరణ ప్రారంభానికి ముందే తమన్నా, కాజల్, మంజిమ, పరుల్‌ కలసి ఓ వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టుకున్నారు. అందులో సినిమా గురించి డిస్కస్‌ చేసుకుంటున్నారు. ‘‘నలుగురు హీరోయిన్లు సేమ్‌ స్టోరీలో, సేమ్‌ క్యారెక్టర్‌లో, సేమ్‌ కంట్రీలో, సేమ్‌ టైమ్‌లో నటించడం అరుదైన విషయం కదా! నాకీ సంగతి చెప్పగానే... ఎగ్జయిటయ్యాను. ప్యారిస్‌లో మేం నలుగురమూ ఏమేం చేయాలనే అంశాలను వాట్సాప్‌ గ్రూప్‌లో డిస్కస్‌ చేసుకున్నాం’’ అని తమన్నా పేర్కొన్నారు. ఇక, కాజల్‌ అయితే... ‘‘తమన్నా, నేను ఆల్మోస్ట్‌ సేమ్‌ టైమ్‌లో కెరీర్‌ స్టార్ట్‌ చేశాం. నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌లో తమన్నా ఒకరు. అయితే సేమ్‌ లొకేషన్‌లో షూట్‌ చేయడం ఫస్ట్‌ టైమ్‌. సరదాగా ఉంటుంది’’ అన్నారు. పరుల్‌ యాదవ్, మంజిమా మోహన్‌... ఇద్దరూ తమన్నా, కాజల్‌తో టైమ్‌ స్పెండ్‌ చేయడానికి, సరదా సంగతులు చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నామన్నారు. ఇదండీ... క్వీన్స్‌ కహానీ!!

క్వీన్‌ కథ...
వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది రాణీ మెహ్రా (కంగనా రనౌత్‌). విజయ్‌ (రాజ్‌కుమార్‌ రావ్‌) తో ఆమె పెళ్లి కుదురుతుంది. హనీమూన్‌కి టికెట్స్‌ కూడా బుక్‌ చేస్తారు. అయితే రేపు వివాహం అనగా.. ‘‘నేను ఫారిన్‌లో పెరిగాను. నా కల్చర్‌ వేరు. నువ్వు నాకు సరి కాదు’’ అంటాడు విజయ్‌. పెళ్లాగిపోతుంది. రాణీ కట్టుకున్న కలల మేడ కూలిపోతుంది. చివరికి వేరొకరి కారణంగా తను బాధపడకూడదని నిర్ణయించుకుంటుంది. హనీమూన్‌ కోసం బుక్‌ చేసిన టిక్కెట్లతో ఒంటరిగా ప్యారిస్‌ వెళుతుంది. కొత్త దేశం.. కొత్త మనుషులు కావడంతో కంగారు పడుతుంది.

కష్టాల్లో ఉన్న రాణీని వరలక్ష్మీ (లీసా హెడన్‌) ఆదుకుంటుంది. మెల్లగా రాణీ ఫారిన్‌ కల్చర్‌కి అలవాటు పడుతుంది. అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటుంది. ఆమె జీవితంలోకి వచ్చిన కొత్త స్నేహితులు ఆమె ఎదుగుదలకు మరింత సహాయం చేస్తారు. రాణీ తనలో ఉన్న టాలెంట్‌కి మెరుగులు దిద్దుకుంటుంది. ఓ సందర్భంలో రాణీ ఫొటోను విజయ్‌ చూస్తాడు. ఆమెపై ఇష్టం పెంచుకుంటాడు. ప్యాకప్‌ అనుకున్న మన రిలేషన్‌షిప్‌ను ప్యాచప్‌ చేసి, కంటిన్యూ చేద్దాం అంటాడు. ఆ తర్వాత కథేంటి? అనేది వికాస్‌ బాల్‌ దర్శకత్వం వహించిన ‘క్వీన్‌’ చూసినవారికి తెలిసే ఉంటుంది.

మరిన్ని వార్తలు