రణ్‌బీర్‌ మా ఇంటికొచ్చి ఆఫర్‌ ఇచ్చాడు

31 Mar, 2020 16:04 IST|Sakshi

బాలీవుడ్‌లో సంచనాలకు మారుపేరు కంగనా రనౌత్‌. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరిణతి సాధిస్తూ... స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన తీరులో ఆమెకు ఆమే సాటి. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెబుతూ.. ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. క్వీన్‌ సినిమాతో ఉత్తమ నటిగా అవార్డు పొందిన కంగనా.. సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక పాత్ర నచ్చకపోతే బడా బాబుల ఆఫర్లను సైతం తిరస్కరిస్తానని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. తాజాగా స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, బడా నిర్మాత ఆదిత్య చోప్రాకు తాను గతంలో నో చెప్పిన విషయాన్ని పింక్‌విల్లాతో పంచుకున్నారు. సంజు, సుల్తాన్‌ సినిమాల్లో నటించే అవకాశం తనకు లభించిందని అయితే తానే వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు.(చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా)

ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ... ‘‘సంజు సినిమాలో నటించమని రణ్‌బీర్‌ కపూర్‌ మా ఇంటికి వచ్చి మరీ నాకు ఆఫర్‌ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో పాత్ర నాకు అంతగా నచ్చలేదు. అందులో నటనకు ఆస్కారం ఉన్నట్లు అనిపించలేదు. కాబట్టి కుదరదని చెప్పాను. అసలు రణ్‌బీర్‌కు నో చెప్పే హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా?ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం.. సల్మాన్‌ ఖాన్‌ సుల్తాన్‌ సినిమా కోసం ఆదిత్య చోప్రా తొలుత నన్ను సంప్రదించారు. నేను కుదరదన్నాను. దాంతో ఆయన నాకు ఫోన్‌ చేసి... ఇంకెప్పుడూ నాతో కలిసి పనిచేయనని చెప్పారు. అదే జరిగింది. అయినా నచ్చని పని చేయనందుకు పశ్చాత్తాపం లేదు’’ అని కంగనా చెప్పుకొచ్చారు

ఇక... నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే తనను ఇండస్ట్రీలో నిలబెట్టాయని.. సంజయ్‌ లీలా భన్సాలీతో సినిమా చేయకపోవడం కాస్త వేదనకు గురిచేసిందని కంగనా పేర్కొన్నారు. పద్మావత్‌ తర్వాత సినిమా చేద్దామన్నారని.. కానీ కుదరలేదని విచారం వ్యక్తం చేశారు. కాగా సంజయ్‌ దత్‌ బయోపిక్‌గా తెరకెక్కిన సంజు భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా సుల్తాన్‌ కూడా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా