‘నేను ఉన్న చోట.. వారిద్దరు ఉండరు’

4 Mar, 2019 09:12 IST|Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరణ్‌ జోహార్‌, హృతిక్‌ రోషన్‌పై మండిపడ్డారు. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌కు హాజరయిన కంగనా.. కరణ్‌ బంధుప్రీతిని ప్రోత్సాహిస్తారని.. తన గురించి హృతిక్‌ రోషన్‌ చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదం అని అన్నారు. ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ.. ‘కరణ్‌ తన షోలో ఉత్తమ నటి లిస్ట్‌లో నా పేరు ప్రకటించలేదు. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన వ్యక్తి అతనికి కనిపించలేదు. కరణ్‌ లాంటి వారు కొందరి నటుల సామర్థ్యాలను జనాల మనసులో ప్రశ్నార్థకంగా మార్చాలని ప్రయతిస్తుంటారు. ఇలాంటివి చేయడం వల్ల నన్ను పట్టించుకోవడం లేదే అని నేను బాధ పడతాననుకుంటే పొరపాటు. వీటన్నింటి వల్ల నేను చాలా బలంగా నిలదొక్కుకోగలిగాను’ అని తెలిపారు.

అంతేకాక ‘ఓ కార్యక్రమంలో కరణ్‌ జోహార్‌ నేను ఉద్యోగం లేక తిరుగుతున్నాని హేళన చేశారు. ఉద్యోగం కోసం నేను తన లాంటి వారిని అడుక్కుంటున్నట్లు కరణ్‌ మాట్లాడాడు. ఒకసారి నా సామర్థ్యాన్ని.. అతని సినిమాలను పరిశీలించండి. విషయం మీకే అర్థం అవుతుంది. ఇలాంటి వారి బుద్ధి వికసించడాని చ్యవన్‌ప్రాశ్‌ అవసరం’ అన్నారు. ఇక హృతిక్‌ రోషన్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఇది చాలా పాత విషయం. ప్రస్తుతం నేను దీనికంత ప్రాధాన్యత ఇవ్వదల్చుకోవడం లేదు. 1970లో జనాలు బెల్‌బాటమ్‌ ప్యాంట్లను ఇష్టపడేవారు. ఇప్పుడు తిరిగి చూసుకుంటే.. అరే అప్పుడు ఎంత మూర్ఖంగా ప్రవర్తించామా అనిపిస్తుంది. హృతిక్‌ రోషన్‌ అంశం కూడా నాకు ఇలానే తోస్తుంది. రెండు సినిమాల్లో దాదాపు ఐదేళ్ల పాటు నాతో కలిసి పని చేసిన వ్యక్తి నేనవరో తెలియదనడం విచారకరం. ఈ అబద్దం నమ్మేలా ఉందా’ అని కంగనా ప్రశ్నించారు. ఈ వివాదాల్లో ఒక వేళ మీరు కరణ్‌, హృతిక్‌ స్థానంలో ఉంటే ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. అలాంటి సందర్భమే ఎదురు కాదు.. నేను ఉన్న చోట వారు అసలే ఉండరు అని నవ్వుతూ సమాధానమిచ్చారు కంగనా. (చదవండి : ఆమెకు  సారీ చెబుతా!)

మరిన్ని వార్తలు