నా చెల్లెలినీ చావబాదారు: నటి సోదరి

2 Oct, 2019 16:41 IST|Sakshi

కంగనా సిస్టర్స్‌ కన్నీటిగాథ..

ముంబై: కంగనా సోదరీమణుల కథ వింటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన నటి కంగనా రనౌత్‌. ధైర్యంగా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె చుట్టూ నిత్యం ఏదో వివాదం ఉండనే ఉంటుంది. ఇక, ఆమె సోదరి రంగోళి చందేల్‌.. నిత్యం ట్విటర్‌లో ఎవరో ఒకరిని టార్గెట్‌ చేస్తూనే ఉంటారు. ఈ వివాదాలు, గొడవలను కాస్తా పక్కనపెడితే.. యాసిడ్‌ దాడి బాధితురాలైన రంగోళీ తాను ఎదుర్కొన్న భయానక గతం తాలూకు అనుభవాలను తాజాగా ట్విటర్‌లో పంచుకున్నారు. జీవితంలో ఎంత స్ట్రగుల్‌ పడి తాము పైకొచ్చామో ఆమె వివరించారు.

డెహ్రాడూన్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు ఓ యవకుడు తనపై యాసిడ్‌ దాడి చేశాడని, దీంతో గత ఐదేళ్లలో తాను 54 సర్జరీలు చేయించుకున్నట్టు రంగోలీ పేర్కొన్నారు. ఆ యాసిడ్‌ దాడి తాలూకు గాయాల చారలతో తాను ఇప్పటికీ ఎలా జీవిస్తున్నది వివరిస్తూ ప్రస్తుత ఫొటోను ఆమె పోస్టు చేశారు. యాసిడ్‌ దాడి సమయంలో తన చెల్లెలు కంగనాను కూడా తీవ్రంగా కొట్టారని, ఆమె దాదాపు చనిపోయేవరకు కొట్టారని రంగోలీ పేర్కొన్నారు. 

యాసిడ్‌ దాడికి పూర్వం ఫొటోను కూడా పోస్టు చేసిన రంగోలీ ‘ఈ ఫొటో తీసిన కాసేపటికే.. ఓ యువకుడు అతని ప్రేమను నేను తిరస్కరించాననే కారణంతో నాపై లీటరు యాసిడ్‌ పోశాడు. దీంతో 54 విచిత్రమైన సర్జరీలు నేను చేయించుకున్నాను. అదే సమయంలో నా చిన్నారి చెల్లెలు కంగనాపై కూడా భౌతికంగా దాడి చేశాడు. ఆమె దాదాపుగా చచ్చేవరకు కొట్టాడు. ఎందుకంటే మా తల్లిదండ్రులు అందమైన, తెలివైన, ఆత్మవిశ్వాసం గల కూతుళ్లకు జన్మనిచ్చారని.. ప్రపంచం ఆడపిల్లల పట్ల ఉదారమైన ప్రేమను చూపదు. అన్ని రకాల సామాజిక దురాచారాలపై పోరాడి.. మన పిల్లలకు సురక్షిత సమాజాన్ని ఇవ్వాల్సిన సమయం ఇది’ అని ఆమె పేర్కొన్నారు.

యాసిడ్‌ దాడి ఎదుర్కొని అనేక కష్టనష్టాలకోర్చి సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కంగనా సిస్టర్స్‌ పట్ల సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగారా? మీ కథ ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికి రంగోలీ బదులిస్తూ.. తన భర్త ఓ స్నేహితుడిలా ఉండి నిరంతరం అందించిన ప్రోత్సాహం, సోదరి కంగనా మద్దతు, తల్లిదండ్రులు అందించిన నైతిక స్థైర్యంతో తాను యాసిడ్‌ దాడి తాలూకు గాయాలను కడిగేసుకొని.. సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని పేర్కొన్నారు. యాసిడ్‌ దాడి తర్వాత ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఇప్పటికీ డాక్టర్లు తన చెవిని సరిచేయలేకపోయారని ఆమె పేర్కొన్నారు. రంగోలీ భర్తతో కలిసి ప్రస్తుతం మనాలీలో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు పృథ్వీరాజ్‌ ఉన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా