సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్‌

15 Jun, 2020 17:37 IST|Sakshi

సుశాంత్‌ ఆత్మహత్య: బాలీవుడ్‌పై‌ కంగనా రనౌత్‌ ఆగ్రహం

బాలీవుడ్‌ ‘క్వీన్’‌ కంగనా రనౌత్‌ మరోసారి ఇండస్ట్రీ‍‌ పెద్దలపై మండిపడ్డారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే ఈ ఫైర్‌బ్రాండ్‌.. ‘‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా లేదా పక్కా పథకం ప్రకారం చేసిన హత్యా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం మనల్ని విషాదంలో ముంచేసింది. అయితే ప్రతీ విషయాన్ని రెండో కోణం నుంచి ఆలోచించాలంటారు కదా. ఎవరి మనసు అయితే బలహీనంగా మారిపోతుందో వారే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. అలాంటి వాళ్లకే ఆత్మహత్య చేసుకుంటారు. స్టాన్‌ఫోర్డ్‌ స్కాలర్‌షిప్‌ సాధించిన వ్యక్తి.. ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ మెరిట్‌ ర్యాంక్‌ సాధించిన విద్యార్థి, అతడి మనసు అలా ఎలా బలహీనమవుతుంది?’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

తను ఎంతగా ప్రాధేయపడ్డాడు?
‘‘తను పెట్టిన ఆఖరి పోస్టులు చూశారా? నా సినిమాలు చూడండి అంటూ అతడు ఎంతగా అభ్యర్థించాడో వాటిని చూస్తే అర్థమవుతుంది. నాకు గాడ్‌ఫాదర్‌ లేడు, నా సినిమాలు ఆడకుంటే ఇండస్ట్రీ నుంచి నన్ను పంపించేస్తారు అంటూ బతిమిలాడాడు. ఎందుకు ఈ ఇండస్ట్రీ నన్ను తనలో ఒకడిగా భావించడం లేదు? అంతా ముగిసినట్లు అనిపిస్తుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు చెప్పండి ఈ ఘటనలో మన ప్రమేయమేమీ లేదంటారా?’’అంటూ కంగన బీ-టౌన్‌ను నిలదీశారు. (ఆ పెయింటింగ్‌.. ఆ పోస్టు.. ముందే చెప్పావా సుశాంత్‌?)

అవార్డులు ఎందుకు ఇవ్వరు?
‘‘తొలి చిత్రం ‘కా పో చే’ బాగున్నా తనకు గుర్తింపు దక్కలేదు. ఎంఎస్‌ ధోని కానివ్వండి, కేదార్‌నాథ్‌ కానివ్వండి, చిచోర్‌ కానివ్వండి. గుర్తింపు ఏది? గల్లిబాయ్‌ వంటి సినిమాలకు అవార్డులు ఇస్తారు. చిచోర్‌ వంటి ఉత్తమ చిత్రాలను, వాటిని తెరకెక్కించిన దర్శకులను పట్టించుకోరు?’’అంటూ రెండు నిమిషాల నిడివి గల ఇన్‌స్టా వీడియోలో కంగన ‘బంధుప్రీతి’(నెపోటిజం)పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాగా కంగన సైతం ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండానే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అనేక కష్టనష్టాలకోర్చి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా.. గొప్ప నటిగా ఎదిగారు. ఇక అవుట్‌సైడర్ల తరఫున గళం వినిపించే కంగనా.. తనలాగే గాడ్‌ఫాదర్‌ లేకుండానే ఇండస్ట్రీలో ప్రవేశించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సుశాంత్‌ ఆత్మహత్యను జీర్ణించుకోలేక ఇలా తన ఆవేదన, ఆగ్రహం వెళ్లగక్కారు. ప్రతిభను గుర్తించాలే తప్ప కష్టసమయాల్లో అధికంగా దృష్టి సారించి సెలట్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదని మీడియాకు హితవు పలికారు. సహానుభూతి కలిగి ఉండాలని కోరారు.(‘సుశాంత్‌ మరణం నాకు పెద్ద మేల్కొలుపు’)

మరిన్ని వార్తలు