దీపికకు థ్యాంక్స్‌: కంగన భావోద్వేగం

8 Jan, 2020 14:42 IST|Sakshi

ముంబై:  తన అభిప్రాయాలను నిక్కచ్చిగా.. ముక్కుసూటిగా వెల్లడించే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. బంధుప్రీతిపై విరుచుకుపడే ఈ ఫైర్‌బ్రాండ్‌.. ఈసారి తోటి హీరోయిన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇంతకీ విషయమేమిటంటే.. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఛపాక్‌’ సినిమా శుక్రవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా.. మేఘనా గుల్జార్‌ రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛపాక్‌పై స్పందించిన కంగన... ఈ మూవీలో దీపిక నటన తన సోదరి రంగోలిని గుర్తుచేసిందని భావోద్వేగానికి గురయ్యారు. గొప్ప సినిమాను తెరకెక్కించారంటూ చిత్ర బృందానికి కృతఙ్ఞతలు తెలియజేశారు. (దీపికకు చేదు అనుభవం.. ట్విటర్‌లో ట్రెండింగ్‌!)

ఈ మేరకు... ‘యాసిడ్‌ దాడి బాధితుల స్ఫూర్తివంతమైన కథలను ప్రేక్షకుల ముందుకు తెస్తున్న దీపికా పదుకొనె, మేఘనా గుల్జార్‌, ఛపాక్‌ చిత్ర బృందం మొత్తానికి.. కంగనా రనౌత్‌, ఆమె కుటుంబం  ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఛపాక్‌ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. నా సోదరి రంగోలి చెందేల్‌కు ఎదురైన అనుభవాలు మరోసారి గుర్తుకువస్తున్నాయి. విపత్కర సమయంలో రంగోలి చూపిన ధైర్యం, కఠిన పరిస్థితుల్లో తను వ్యవహరించిన తీరు నాకెంతగానో స్ఫూర్తినిచ్చింది. తన చిరునవ్వు నన్ను విషాదం నుంచి తేరుకునేలా చేస్తుంది’ అని ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్‌ చేశారు.

కాగా కంగనా సోదరి రంగోలిపై గతంలో యాసిడ్‌ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రేమను నిరాకరించినందన్న కారణంతో ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. యాసిడ్‌ ధాటికి తన అవయవాలు కరిగిపోవడంతో వాటి కోసం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే 54 సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పటికీ డాక్టర్‌లు రంగోలి చెవి భాగాన్ని మాత్రం పునర్నిర్మించలేకపోయారు. ఈ విషయాల గురించి రంగోలి గతంలో అభిమానులతో పంచుకున్నారు.

ఇక కంగన నటించిన తాజా చిత్రం.. ‘పంగా’ విడుదలకు సిద్ధంగా ఉంది. కబడ్డీ క్రీడా నేపథ్యంలోజనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌పై దీపిక కూడా ప్రశంసలు కురిపించడం విశేషం. కాగా జేఎన్‌యూలో విద్యార్థులకు పరామర్శించినందుకు గానూ దీపికను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘ఛపాక్‌ను బాయ్‌కాట్‌ చేయాలి... కంగనా సినిమా పంగాను ప్రోత్సహించాలి’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనా వీడియో విడుదల చేయడం ద్వారా అలాంటి వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చారంటూ మరికొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.(ఆకట్టుకుంటున్న ‘పంగా’ ట్రైలర్‌)

Kangana Ranaut and family would like to thank @deepikapadukone, @meghnagulzar and the entire team of #chhapaak for their incredible feat in bringing stories of acid attack victims to the forefront.

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

>
మరిన్ని వార్తలు