మణికర్ణిక మూడు రోజుల వసూళ్లు ఇలా..

28 Jan, 2019 13:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వివాదాల నడుమ విడుదలైన మణికర్ణిక చిత్రం విమర్శకుల ప్రశంసలతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. తొలిరోజు ఆశించిన వసూళ్లు లేకున్నా మెల్లగా పుంజుకున్న మణికర్ణిక రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో ఝాన్సీ లక్ష్మీభాయిగా ప్రేక్షకులను అలరించడంతో వసూళ్లు జోరందుకున్నాయి. మరోవైపు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించిన థాకరే బయోపిక్‌ మహారాష్ట్రలో విజయవంతంగా నడుస్తున్నా థియేటర్ల వద్ద మణికర్ణిక జోరు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.

ఢిల్లీ, ఎన్‌సీఆర్‌, యూపీ, పంజాబ్‌, రాజస్ధాన్‌లలో మణికర్ణిక భారీ వసూళ్లను రాబడుతోం‍దని విడుదలైన మూడు రోజుల్లో హిందీ, తమిళ్‌, తెలుగు వెర్షన్‌లు కలిపి భారత్‌లో ఈ సినిమా మొత్తం 42.55 కోట్లను రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. జీ స్టూడియోస్‌ భాగస్వామ్యంతో నిర్మించిన మణికర్ణిక దేశవ్యాప్తంగా 3000 స్క్రీన్‌లపై ప్రదర్శింపబడుతోంది. ఈ మూవీ మున్ముందు బాక్సాఫీస్‌ వద్ద ఇదే జోరు కొనసాగిస్తుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు