కనికా కపూర్ సంచలన నిర్ణయం

28 Apr, 2020 14:11 IST|Sakshi

సాక్షి, లక్నో: కరోనా వైరస్ వ్యాప్తిపై అనేక వివాదాలు,ఆరోపణలు, ఆఖరికి యూపీ పోలీసుల కేసును కూడా ఎదుర్కొన్న బాలీవుడ్ సింగ‌ర్ క‌నికా క‌పూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ప్రాణాంతక  కరోనావైరస్ నుండి ఇటీవల కోలుకున్న కనికా కరోనా పేషెంట్ల కోసం త‌న ప్లాస్మాను దానం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ మేర‌కు ఆమె ల‌క్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివ‌ర్సిటీ (కేజీఎంయూ) అధికారుల‌ను సంప్ర‌దించి రక్త నమూనాలను ఇచ్చారు.  

ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ విభాగం అధిపతి తులికా చంద్ర ఆమె రక్త నమూనాను పరీక్ష కోసం తీసుకున్నట్టు వెల్లడించారు. పరీక్షల అనంతరం నిర్ణయం తీసుకుంటామనీ, అన్నీ సవ్యంగా వుంటే   ఆమెను ప్లాస్మా స్వీకరణకు పిలుస్తామని తులికా చంద్ర చెప్పారు. కరోనా బారిన పడి వరుసగా నెగిటివ్ రిపోర్టులు వచ్చినా, ధైర్యం కోల్పోకుండా పూర్తిగా కోలుకున్న కనికా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లక్నోలో ఉంటున్నారు. తనపై అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేశారంటూ తన  అనుభవాలను  ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. (ఇన్నిరోజులు మౌనంగా భ‌రించా : క‌నికా క‌పూర్)

ప్లాస్మా థెరపీ సత్ఫలితాలనిస్తుండటంతో ఢిల్లీ, కేర‌ళ స‌హా ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా చికిత్స కోసం ప్లాస్మా థెర‌పీని అందిస్తున్నారు. కేజీఎంయూలో కోలుకున్న ముగ్గురు తమ ప్లాస్మాను దానం చేశారు. వీరిలో కేజీఎంయూ రెసిడెంట్ డాక్టర్, కెనడాకు చెందిన మహిళా వైద్యురాలు, మరొక రోగి వున్నారు. ఆదివారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 58 ఏళ్ల ఓ క‌రోనా పేషెంట్‌కు ప్లాస్మా థెర‌పీతో కోలుకుంటున్నాడ‌ని వైద్యులు ప్రకటించడం విశేషం. (కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం)

కాగా  కోవిడ్-19 రోగులకు  ప్లాస్మా చికిత్సను ఒక ప్రయోగాత్మక ప్రక్రియగా గుర్తించారు. వైరస్ బారిన పడి కోలుకున్నఆరోగ్యకరమైన వ్యక్తి ప్లాస్మా(రక్త భాగం)ను స్వీకరించి కరోనావైరస్ రోగికి చికిత్స‌కు ఉప‌యోగిస్తారు. అయితే ప్లాస్మా దాతలకు డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, మ‌లేరియా, సిఫిలిస్ వంటి వ్యాధులు ఉండకూడదు. మరోవైపు ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల రాష్ట్రాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు