గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్

6 Oct, 2015 17:13 IST|Sakshi
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఆస్పత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.  జిమ్లో మంగళవారం వర్కవుట్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలారు. ఈ విషయాన్ని జిమ్ మేనేజర్ వెంటనే శివరాజ్ కుమార్ భార్య గీతకు తెలుపగా ఆయనను దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

శివరాజ్ కుమార్కు గుండెపోటు వచ్చినట్టు డాక్టర్లు గుర్తించినట్టు తెలుస్తోంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో 2 చోట్ల అడ్డంకులను డాక్టర్లు గుర్తించి ఆంజియోప్లాస్టీ చేస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరో రెండు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారని సమాచారం.

54 ఏళ్ల శివరాజ్ కుమార్ కన్నడ కంఠీరవుడుగా ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ తనయుడు. ప్రస్తుతం ఆయన రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'కిల్లింగ్ వీరప్పన్' లో నటిస్తున్నారు.