వెండితెరపై సాహస వనిత

25 Jul, 2017 14:18 IST|Sakshi
వెండితెరపై సాహస వనిత
  • ఐపీఎస్‌ రూప జీవితం, పరప్పన జైలు అక్రమాలే కథ
  •  కన్నడ, తమిళంలో సినిమా నిర్మాణం
  •  దర్శకుడు ఏఎంఆర్‌ రమేష్‌ సన్నాహాలు
  •  ఈ నెల 29న ప్రకటన

  • సాక్షి, బెంగళూరు: నిజజీవితంలో సంచలనాలు సాధించిన పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, కళాకారులపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అదే కోవలో మరో సినిమా కూడా రావడం ఖాయమైంది. తాజాగా బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో గుట్టురట్టయిన అక్రమాలపై శాండల్‌వుడ్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది.

    ఆ జైల్లో అవినీతి గురించి ధైర్యంగా బట్టబయలు చేసిన మహిళా ఐపీఎస్‌ అధికారి డీ.రూప జీవితం ఈ చిత్ర కథాంశం. వాస్తవ ఘటనల ఆధారంగా సైనైడ్, అట్టహాస వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏ.ఎం.ఆర్‌.రమేశ్‌ ఈ సినిమాను  తెరకెక్కించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు అతిథి మర్యాదలు కల్పించడానికి అధికారులు రూ.2 కోట్లు లంచం తీసుకున్నట్లు ఐపీఎస్‌ అధికారి డీ.రూప తమ నివేదిక ద్వారా వెలుగులోకి తెచ్చారు.

    అనంతర పరిణామాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలుగా మారాయి. ఈ ఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు రమేశ్‌ సన్నాహాలు చేస్తున్నారు. జైలు వ్యవహారాలపై దర్యాప్తు అధికారులు  నాలుగు దక్షిణాది రాష్ట్రాల అధికారులను, రాజకీయ నాయకులను, బిల్డర్లను రహస్య విచారణ చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో రూప, పరప్పన జైలు కథను దర్శకుడు రమేష్‌ అందరికంటే ముందే ఎంచుకున్నారు. సినిమాను ఏక కాలంలో కన్నడ, తమిళ భాషల్లో చిత్రీకరిస్తారని తెలిసింది. తెలుగులోకి కూడా అనువదించి విడుదల చేసే అవకాశాన్ని చిత్ర యూనిట్‌ పరిశీలిస్తోంది. ఈ చిత్రంలోనే జైళ్లలో వాస్తవ పరిస్థితులతో పాటు గతంలో ఒక డీఐజీ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని చూపించించనున్నట్లు సమాచారం.

    ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే పోలీసు పాత్రలకు శాండల్‌వుడ్‌లో మంచి పేరు గడించిన సీనియర్‌ నటి మాలాశ్రీ కాని, ఇప్పుడిప్పుడే పోలీస్‌పాత్రలు వేస్తున్న రాగిణి ద్వివేదిని కానీ ఎంచుకునే అవకాశం ఉంది. మరోవైపు చిత్రంలో కనీసం ఒక్క సీన్ లో నైనా ఐపీఎస్‌ అధికారి రూపను నటింపచేయాలని చిత్ర యూనిట్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు గాంధీనగర్‌ వర్గాలు చెబుతున్నాయి.  చిత్ర కథలో జైలు అక్రమాలు, ఐపీఎస్‌గా రూప తీసుకున్న సంచలన నిర్ణయాలు చిత్రకథలో ఉంటాయి.

    రూప అనుమతి తీసుకుంటాం
    చిత్ర దర్శకుడు ఏ.ఎం.ఆర్‌.రమేశ్‌ మాట్లాడుతూ 'కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. తెలుగులో కూడా విడుదల చేసే విషయం కూడా పరిశీలనలో ఉంది. ఐపీఎస్‌ అధికారి డీ.రూప ఛేదించిన అవినీతి ఘటనల ఆధారంగా తీయనున్నాం. చిత్రం టైటిల్‌లో రూప పేరు కూడా ఉండనుండడంతో ఐపీఎస్‌ అధికారి డీ.రూప అనుమతి తప్పనిసరి. ఇప్పటికే సినిమాపై పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతో చర్చించాం. జులై 29న మరోసారి వారితోను, చిత్రానికి మూలాధారమైన ఐపీఎస్‌ డీ.రూపతోను చర్చించి ఆమోదాల అనంతరం షూటింగ్‌ ప్రారంభిస్తామ'న్నారు.

>