కన్నడ సినిమా... ఛలో అమెరికా!

19 Jan, 2016 23:36 IST|Sakshi
కన్నడ సినిమా... ఛలో అమెరికా!

సినిమా రాబడికి  సంబంధించి ఇండియాతో పాటు విదేశాల్లో వసూళ్ళు చాలా కీలకం. హిందీతో పాటు తమిళ, తెలుగు చిత్రాలకు ఈ ఓవర్‌సీస్ మార్కెట్ చాలా పెద్దది. మలయాళ సినిమాలకూ కొన్ని దేశాల్లో చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. ఇప్పుడు క్రమంగా కన్నడ సినిమాలు కూడా ఆ బాట పడుతున్నాయి.
 
 గడచిన 2015 గణాంకాలను బట్టి చూస్తే, కన్నడ చిత్రాలు కూడా అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల్ని ప్రేక్షకులుగా మలుచుకుంటూ, క్రమంగా ఓవర్‌సీస్‌లో విస్తరిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా.  2015లో దాదాపు 14 కన్నడ సినిమాలు అమె రికాలో రిలీజయ్యాయి.
 
  అందులో మన సాయి కుమార్ నటించగా, కొత్తవాళ్ళు తీసిన ప్రయోగా త్మక థ్రిల్లర్ చిత్రం ‘రంగి తరంగ’, ఉపేంద్ర చేసిన ‘ఉప్పి2’ లాంటివి బాగా ఆడాయి. ఈ కన్నడ చిత్రాలన్నీ కలిపి 4.2 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు పేర్కొ న్నాయి. ఇతర దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ లతో పోలిస్తే, అమెరికాలో రిలీజవు తున్న కన్నడ సినిమాల సంఖ్య, వాటి వసూళ్ళు కొద్దిపాటే కావచ్చు. కానీ క్రమంగా పెరిగే సూచ నలు కనబడుతున్నాయి. కొత్త ఏడాదిలో మరిన్ని కన్నడ ఫిల్మ్స్ యుఎస్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.
 
 గతంలో అమెరికాలోని కన్నడ సంఘాలు స్పాన్సర్ చేసి, ఒకటి రెండు రోజుల పాటు ఈ సినిమాల్ని ప్రదర్శించేవి. ఆ సంఘాల సభ్యులు టికెట్లు కొనుక్కొని, ప్రదర్శనలు జరుగుతున్న చోటుకెళ్ళి చూసొచ్చే వారు. కానీ, ‘రంగి తరంగ’ ఏకంగా 40 చోట్ల రిలీజైంది. నిరుడు అమెరికాలో వచ్చిన కన్నడ సినీ వసూళ్ళలో అధిక భాగం ఈ చిత్రం సంపాదించినవే.
 
 ఇక, ‘ఉప్పి-2’ కూడా 25 చోట్ల విడుదలైంది. ఈ చిత్ర యూనిట్లు అమెరికాలో ఈ ప్రాంతాలు తిరిగి, అక్కడి ప్రేక్షకుల్ని కలిశారు. ఆ పబ్లిసిటీ వసూళ్ళకి తోడ్పడింది. ‘కేరాఫ్ ఫుట్‌పాత్ 2’, ‘మిస్టర్ ఐరావత’, ‘ప్లస్’ లాంటి చిత్రాలు గత ఏడాది బాగా ఆకర్షించాయి. దాంతో, ఈ కొత్త ఏడాది మరిన్ని కన్నడ సినిమాలు ఓవర్సీస్ రిలీజ్‌కు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే, తెలుగు, తమిళాలకు భిన్నంగా కన్నడ సినిమాలు ఇండియాలో రిలీజయ్యాక ఒకటి, రెండు వారాలు ఆలస్యంగా అమెరికాకు వెళుతున్నాయి.