చిరంజీవి సర్జాకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

8 Jun, 2020 19:29 IST|Sakshi

ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా(39) గుండెపోటుతో కన్నుమూసిన విషయం విదితమే. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న ఫాంహౌజ్‌లో సోమవారం కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కన్నడ సినీస్టార్లు కిచ్చా సుదీప్‌, యశ్‌, కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడు డీకే శివకుమార్‌ తదితరులు చిరంజీవి సర్జా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను డీకేశీ ట్విటర్‌లో పంచుకున్నారు. ‘‘చిరంజీవి సర్జాకు నివాళులు అర్పించాను. అర్జున్‌ సర్జా, సుందర్‌ రాజ్‌, చిరంజీవి భార్య మేఘనా రాజ్‌, సోదరుడు ధృవ్‌ సర్జాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ విషాద సమయంలో ఆ దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’’ అని సంతాపం ప్రకటించారు.(కన్నడ నటుడు చిరంజీవి సర్జా కన్నుమూత)

ఇక కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి సైతం చిరంజీవి సర్జాకు నివాళులు అర్పించారు. హీరోయిన్లు రష్మిక మందన్న, కృతి కర్బంధ, రాధికా పండిట్‌, నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అల్లు శిరీష్‌ తదితరులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కాగా ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన చిరంజీవి సర్జా ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. 19 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2018 మే 2న నటి మేఘనా రాజ్‌ను వివాహమాడారు. ఇటీవలే వారి రెండో వివాహ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మేఘనా ఓ అందమైన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇంతలోనే భర్త హఠాన్మరణం చెందడంతో ఆమె శోకంలో మునిగిపోయారు. కాగా మేఘనారాజ్‌ తెలుగులో బెండు అప్పారావు, లక్కీ సినిమాల్లో కనిపించారు. ఇక యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా.. చిరంజీవికి అంకుల్‌ అన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు