శ్రమే నా సుకృతం

27 Feb, 2019 00:55 IST|Sakshi

సీరియల్‌

ఎలాంటి బాధ్యతలు లేకుండా కాలేజీకి వెళ్లే ఒక బెంగాలీ అమ్మాయికి తల్లి ఒక్కత్తే ఆలంబన. అలాంటిది తల్లి చనిపోవడంతో ఒంటరిదవుతుంది. అనుకోకుండా బెంగాల్‌ నుంచి తెలుగు నేలకు చేరిన ఆ అమ్మాయి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలే ‘కనులు మూసినా నీవాయే’ సీరియల్‌ కథ చెబుతుంది. స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌లో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. ఇండిపెండెంట్, ఎమోషనల్‌ గర్ల్‌గా ప్రధాన పాత్రలో సుకృత నటిస్తోంది. వెండితెర మీద వెలిగి బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుకృత పరిచయం ఆమె మాటల్లోనే..

యాంకర్‌ నుంచి సినిమా
‘పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. కాలేజీ చదువు అయిపోవడంతోనే కన్నడ టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా చేరాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ప్రితియా రాయబారి అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. అమ్మనాన్న బాగా చదువుకున్నవారు. లోకం గురించి వారికి బాగా తెలుసు. ఆడపిల్లను అని ఎక్కడా నాకు అడ్డంకులు చెప్పకుండా ప్రోత్సహించారు. అలా కన్నడ సినిమాలకు పరిచయం అయ్యాను. అటు తర్వాత కన్నడలోనే నాలుగైదు సీరియల్స్‌ చేశాను. కన్నడ సీరియల్‌లో ‘రాజకుమారి’ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అట్నుంచి తెలుగులో ‘నేను–నా ఫ్రెండ్స్‌’ అనే సినిమాలో నటించాను. ఆ తర్వాత తెలుగు స్టార్‌ మా ‘కనులు మూసినా నీవాయే’ సీరియల్‌లో నటించడానికి అవకాశం వచ్చింది. అలా ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉండే భయాలు ఇప్పుడు లేవు. ప్రతిరోజు నేర్చుకోవడానికి ఇక్కడ మంచి స్కోప్‌ ఉంటుంది.  

సినిమా నుంచి సీరియల్‌
ఇది చిన్న పని, అది పెద్ద పని అని లెక్కలు వేసుకోను. నాకు పని ఉండాలి. పని చేస్తూ ఉంటే మంచి ఫలితాలు అవే వస్తాయి అని గట్టిగా నమ్ముతాను. అదీ కాకుండా ఈ రోజుల్లో సీరియల్‌ అమ్మాయి, సినిమా అమ్మాయి అనే తేడా లేదు. క్రియేటివిటీ, చార్మ్‌ను అందరూ గుర్తిస్తున్నారు. అలా చాలా మంది తమ వర్క్‌లో చాలా ఎఫర్ట్‌ పెడుతున్నారు. ఒకటే తేడా ఏంటంటే.. సినిమాలో అయితే రోజులో ఒకట్రెండు సీన్స్‌ వుంటాయి. అదే సీరియల్‌ అయితే రోజులో ఎనిమిది సీన్లు కూడా ఉంటాయి. ఆ విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు పనితోనే సరిపోతుంది. సినిమా వర్క్‌ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటే, సీరియల్‌ వర్కింగ్‌ చాలా హోమ్లీగా ఉంటుంది. సినిమాలో హీరో హీరోయిన్స్‌ సీన్స్‌ ఎక్కువ ఉంటాయి. కానీ, కుటుంబానికి సంబంధించిన సీన్లన్నీ సీరియల్స్‌లోనే ఎక్కువ. 

సీరియల్‌ నుంచి రియల్‌ వర్క్‌ 
సీరియల్స్‌ తర్వాత నా వర్క్‌ బ్యుటిషియన్‌ చుట్టూతానే తిరుగుతుంటుంది. ఈ ఫీల్డ్‌కి రాకముందు బ్యుటిషియన్‌ కోర్సు చేశాను. నాకు ఆ వర్క్‌ అంటే చాలా ఇష్టం. ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా బ్యూటిషియన్‌కు సంబంధించిన కొత్తవివరాలు సేకరిస్తూ ఉంటాను. అంతేకాదు, సినిమా హీరోయిన్స్‌కి కూడా బ్యూటీ వర్క్‌ చేస్తాను. వంట చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అన్ని డిష్‌లను కొత్తగా వండి వార్చడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. స్విమ్మింగ్‌ మాత్రం పిచ్చి. అవకాశాలు వస్తే సీరియల్స్, సినిమాలూ రెండూ  చేస్తాను. సీరియల్, సినిమా ఏదైనా స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ చేయాలనేది నా యాంబిషన్‌. 

పేరులో మార్పు
నా పేరులో అంజనా దేశ్‌పాండే అని ముందు ఉండేది. అంజనా సుకృత అని నా పూర్తి పేరు. ఇప్పుడు సుకృత అని మాత్రమే మార్చుకున్నాను. పేరులో ప్రత్యేకత ఉంటుందని అలా మార్చుకున్నాను. మా నాన్న బ్యాంక్‌ మేనేజర్, అమ్మ హౌజ్‌వైఫ్‌. ఈ ఫీల్డ్‌ గురించి వాళ్లెప్పుడూ భయపడలేదు. నా గురించి వాళ్లకు బాగా తెలుసు. నన్ను బాగా ఎంకరేజ్‌ చేస్తారు. 
– ఎన్‌.ఆర్‌ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు