కపిల్.. పెళ్లి చేసుకుంటున్నాడా?

18 Mar, 2017 14:20 IST|Sakshi
కపిల్.. పెళ్లి చేసుకుంటున్నాడా?

స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ అంటే తెలియని టీవీ ప్రేక్షకులు సాధారణంగా ఉండరు. గతంలో కామెడీ నైట్స్ విత్ కపిల్, ఇప్పుడు ద కపిల్ శర్మ షోలతో పాటు పలు అవార్డు ఫంక్షన్లలో కూడా తనదైన స్పాంటేనియస్ కామెడీతో జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతుంటాడు కపిల్. తన పంజాబీ యాసతో కూడిన హిందీతో కాస్త నాటు జోకులను కూడా మామూలు మాటల్లో కలిపేసే కపిల్‌ను అభిమానించేవాళ్లలో అన్ని వర్గాల వాళ్లు ఉంటారు. ఇక తన షోలకు వచ్చేవాళ్లు, అవార్డు ఫంక్షన్లకు వచ్చే హీరోయిన్లతో అతడు మాట్లాడే తీరు ఒక రకంగా ఉంటుంది. తనకంటే పొడవైన శిల్పాశెట్టి, దీపికా పదుకొనే లాంటి వాళ్ల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తాడు. అలాంటి కపిల్.. ఇన్నాళ్లకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కపిలే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు. తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

''తను నా బెటర్ హాఫ్ అని చెప్పను. ఆమె నన్ను సంపూర్ణ వ్యక్తిగా చేస్తుంది. లవ్‌ యూ జిన్నీ.. ఆమెను దయచేసి స్వాగతించండి. నేను ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాను'' అని చెప్పాడు. ఈ ఫొటోను అప్‌లోడ్ చేయడానికి కొద్ది ముందుగా.. తన అభిమానులకు ట్విట్టర్‌లో చిన్న టీజర్ కూడా ఇచ్చాడు. తాను ఒక 'అందమైన' విషయాన్ని పంచుకోబోతున్నట్లు చెప్పాడు. అందుకోసం ఒక్క అరగంట ఆగాలని కోరాడు. ఈలోపు ఏం రాయలో ప్రిపేర్ అయ్యాడో ఏమోగానీ.. చివరకు తన మనసులోని విషయాన్ని ప్రపంచానికి చాటాడు. కపిల్ తన ప్రేయసిని అందరికీ చూపించడం ఇదే మొదటిసారి. దాన్నిబట్టి చూస్తుంటే త్వరలోనే అతడు పెళ్లి కూడా చేసుకుంటాడని భావిస్తున్నారు.

2007 సంవత్సరంలో తొలిసారిగా 'ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ షో'తో కపిల్ ప్రాచుర్యం పొందాడు. ఆ తర్వాత సోనీ టీవీ వాళ్ల కలర్స్ చానల్లో తన కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో మంచి పాపులారిటీ సాధించాడు. హీరో హీరోయిన్లు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవాలంటే ముందుగా ఈ షోనే ఎంచుకుంటారు. సీనియర్ హీరోలు, హీరోయిన్లతో కూడా బాగా చలాకీగా మాట్లాడే కపిల్ పెళ్లి విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద వార్తగానే నిలిచింది. 2015లో నలుగురు హీరోయిన్లతో కలిసి తీసిన కిస్ కిస్‌కో ప్యార్ కరూ సినిమాతో బాలీవుడ్‌లో కూడా కపిల్ అడుగుపెట్టాడు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తన తల్లికి మూడ్ తిరిగితే రేపే పెళ్లి చేసేస్తుందని ఆ షోలో కరణ్‌ జోహార్‌తో అన్నాడు. ప్రస్తుతం కపిల్ చేతిలో రెండు సినిమాలు కూడా ఉన్నాయి.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా