నటి శ్రీరెడ్డికి నోటీసులు జారీ

7 Mar, 2020 07:14 IST|Sakshi

చెన్నై వెళ్లి అందించిన సైబర్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో:  తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దుర్భాషలాడుతూ రూపొందించిన వీడియోను నటి శ్రీరెడ్డి ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారంటూ సినీ నటి కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో నిందితురాలిగా పరిగణిస్తూ శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వీటిని తీసుకుని చెన్నై  వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం ఆమెకు అందించింది. 2018లో ఓ ఛానల్‌లో జరిగిన చర్చ నేపథ్యంలో కరాటే కళ్యాణి, శ్రీరెడ్డి పరస్పరం గొడవ పడ్డారు. దీనికి సంబంధించి శ్రీరెడ్డి హుమాయూన్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇటీవల కళ్యాణికి నోటీసులు జారీ చేశారు. దీంతో మధ్య మరోసారి వివాదం రేగింది. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి, కళ్యాణిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ, కించపరిచేలా 20 నిమిషాల నిడివితో రూపొందించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు.

దీనిని చూసిన కళ్యాణి సదరు వీడియోతో పాటు దానికి సంబంధించిన యూఆర్‌ఎల్‌ను పొందుపరుస్తూ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నేను పట్టించుకోను, నన్ను అరెస్ట్‌ చేసినా సరే అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. గత నెల్లో సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసిన కళ్యాణి తన ఫిర్యాదుతో పాటు, వీడియోతో కూడిన సీడీని అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు కేసు దర్యాప్తు చేపట్టారు. శ్రీరెడ్డిని సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం, ఆమె చెన్నైలో ఉన్నట్లు తెలియడంతో గురువారం అక్కడికి వెళ్లిన బృందం శుక్రవారం ఆమెకు నోటీసులను అందించింది. మరోపక్క ఈ కేసులో సాక్షిగా ఉన్న ఓ డ్యాన్స్‌ మాస్టర్‌కు వింత చిక్కు వచ్చిపడింది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన యాంకర్‌ ప్రశ్నకు బదులిస్తూ తన జీవితంలో చూసిన మేటి డ్యాన్సర్‌ అంటూ ఓ యువ హీరో పేరు చెప్పారు. దీన్ని యూట్యూబ్‌లో చూసిన మరో యువహీరో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. డ్యాన్సు యూనిట్‌ ఏర్పాటు కోసం ఆయన సోషల్‌మీడియాలో తన ఫోన్‌ నెంబర్‌ పోస్టు చేశారు. దీని ఆధారంగా సదరు డ్యాన్స్‌ మాస్టర్‌కు ఫోన్లు చేస్తున్న సదరు అభిమానులు తీవ్రంగా బెదిరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే బంజారాహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేసిన ఆయన శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 

మరిన్ని వార్తలు