‘విత్ యూ’ యాప్‌కు కరీనా ప్రచారం

21 Dec, 2013 23:25 IST|Sakshi
‘విత్ యూ’ యాప్‌కు కరీనా ప్రచారం
మహిళల భద్రత కోసం చానెల్ ‘వి’ చేస్తున్న ప్రయత్నాలకు సాయం చేయడానికి బాలీవుడ్ హాట్‌బ్యూటీ కరీనాకపూర్ ఖాన్ ముందుకు వచ్చింది. ముంబై నగరం మహిళలకు ఎంతమాత్రమూ సురక్షితం కాదని కూడా బెబో చెప్పింది. ఆపదలో ఉన్న మహిళలు తమవారికి సందేశం పంపించడానికి ఉపయోగపడేందుకు చానెల్ వి ‘విత్‌యూ’ పేరుతో ఒక ఆప్‌ను తయారు చేసింది. దీని గురించి ప్రచారం చేసేందుకు కరీనా అంగీకరించింది. ఈ ఆప్ బటన్‌ను నొక్కగానే బాధితురాలి సంరక్షకులు లేదా కుటుంబ సభ్యులకు ఫోన్లకు వెంటనే సమాచారం చేరుతుంది. ‘నాకు ఈ ఆప్ గురించి చెప్పగానే దీనిపై ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాను. ముంబై వంటి నగరాల్లో నేరాలరేటు విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి మహిళలకు తగిన భద్రత ఎంతైనా అవసరం. 
 
 నటులకు భారీగా ప్రజాదరణ ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటి గురించి ప్రచారం చేయడానికి వాళ్లు ముందుకు రావాలి’ అని కరీనా వివరించింది. ఈ విషయంలో భర్త సైఫ్‌అలీఖాన్ కూడా తనకు సహకరిస్తున్నడని చెప్పింది. ‘సైఫ్‌తోపాటు మా అమ్మ కూడా నేను ఈ పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు. ఇందులో తానూ పాల్గొని ఉంటే బాగుండేదని సైఫ్ అన్నాడు’ అని వివరించిన కరీనా ముంబై శక్తిమిల్లు ప్రాంతంలో మహిళా జర్నలిస్టు అత్యాచారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ పక్కింట్లోనే ఉండే ఓ విదేశీయురాలిపైనా ఇటీవల అత్యాచారం జరిగిందని, మనం నివసించే నగరంలోనే ఇలాంటివి జరుగుతున్నాయని తలుచుకుంటేనే భయంగా ఉందని తెలిపింది. ముంబైలో తరచూ లైంగిక నేరాలు జరుగుతుండడంతో రాత్రివేళ తాను షూటింగులకు వెళ్లినప్పుడు అమ్మ కూడా గాబరా పడుతోందని వివరించింది. ప్రతి మనిషి ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలని, చదువుతోనే మంచి మనుషులుగా మారుతామని చెప్పింది.