ముద్దుగుమ్మకు 33 ఏళ్లు

21 Sep, 2013 15:20 IST|Sakshi
ముద్దుగుమ్మకు 33 ఏళ్లు

సైఫ్ అలీఖాన్ అమృతాసింగ్ను తొలిసారి పెళ్లి చేసుకున్నప్పుడు.. అప్పటికి పదేళ్ల వయసున్న కరీనా కపూర్ వెళ్లి, 'కంగ్రాచ్యులేషన్స్ అంకుల్' అని చెప్పింది. తర్వాత కొంత కాలానికి.. అదే 'అంకుల్'ను పెళ్లి చేసుకుంది.

హృతిక్ రోషన్ను లాంచ్ చేస్తూ భారీ స్థాయిలో 'కహో నా ప్యార్ హై' సినిమాలో అమీషా పటేల్కు బదులు.. కరీనా కపూర్ను హీరోయిన్గా లాంచ్ చేద్దామనుకున్నారు. కానీ, అందులో తాను చేస్తే.. తనకు పేరు రాదని, మొత్తం క్రెడిట్ అంతా హృతిక్ రోషన్కే వెళ్లిపోతుందని, అలాగే ఆ సినిమా తర్వాత తనకు పెద్దగా అవకాశాలు కూడా ఉండవని భావించి, అంత పెద్ద లాంచింగ్కు 'నో' చెప్పేసింది. అంతటి ధైర్యం ఆమె సొంతం. నటన ఆమె రక్తంలోనే ఉంది. తాత ముత్తాతల దగ్గర్నుంచి ప్రతి ఒక్కళ్లూ నటీనటులే. అలాంటి వంశంలో పుట్టి, స్వయంగా అక్క కరిష్మా కపూర్ నుంచి కూడా నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని తెరంగేట్రం చేసిన కరీనా కపూర్.. అదే ప్రస్తుతం చెప్పుకోవాలంటే కరీనా కపూర్ ఖాన్ 33వ పుట్టిన రోజు చేసుకుంటోంది.

'జబ్ వుయ్ మెట్' లాంటి సినిమాల్లో అయితే.. అల్లరి అల్లరిగా తిరిగే చలాకీ పిల్లగా ఎంత అద్భుతంగా నటిస్తుందో.. పూర్తి స్థాయి పరిణతి సాధించి, ప్రేమలో విఫలమైన తర్వాత కళ్లతోనే సమస్త భావాలు పలికించే ఆరిందాలా కూడా అంతే అద్భుత ప్రదర్శన చూపించడం ఆమెకే సొంతం. కరీనా నటించిన మరికొన్ని చిత్రాల వివరాలివీ..

రెఫ్యూజీ (2000): కరీనాను అత్యంత అందంగా, అద్భుతమైన వ్యక్తిత్వంతో చూపించిన సినిమా.. రెఫ్యూజీ. దర్శకుడు జేపీ దత్తా తన స్నేహితుడు రణధీర్ కపూర్కు మాట ఇచ్చి.. కరీనాను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా తెరముందుకు తీసుకొస్తానన్నారు. తన హామీ నిలబెట్టుకున్నారు. మొట్టమొదటి సీన్లో అభిషేక్ బచ్చన్ ఆమె ముఖం మీద నీళ్లు చల్లుతాడు. పాకిస్థాన్ సరిహద్దు నుంచి కుటుంబంతో వచ్చిన అమ్మాయి పాత్రలో కరీనా మళ్లీ అలనాటి నటీమణులు నూతన్, మధుబాల, నర్గీస్ లాంటి వాళ్ల నటనను గుర్తుచేసింది. నాటి నుంచి నేటి వరకు అప్రతిహతంగా 14 ఏళ్లుగా నటిస్తూనే ఉంది.

అశోక (2001): రెఫ్యూజీ తర్వాత కరీనా నటించిన చిత్రమిది. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెండి తెర మీద యుద్ధవీరగా కనిపిస్తుంది. షారుక్ ఖాన్తో నటించిన ప్రతి ఒక్క సీన్లోను తనలోని ఫైర్ మొత్తాన్ని రంగరించి చూపింది.

చమేలీ (2004): రోడ్డుమీద నడుచుకుంటూ వర్షంలో నృత్యం చేస్తూ.. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో అతిలోక సుందరిగా దర్శనమిచ్చే సినిమా ఇది. తనమీద తాను ఏమాత్రం జాలి చూపించకుండా.. అద్భుతాలు రంగరించి చూపే చిత్రం. దర్శకుడు సుధీర్ మిశ్రా ఈ చిత్రంలో కరీనా నటన చూసి ఎంతగా పడిపోయారంటే, మళ్లీ ఇదే చమేలీతో చేస్తానని ఎదురుచూశారు.

యువ (2004): మణిరత్నం అంటేనే ప్రతి ఒక్కళ్ల దగ్గర్నుంచి నటనను పూర్తిస్థాయిలో పిండుకుంటాడు. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచనలు లేకుండా.. సరదాగా, ఆడుతూ పాడుతూ తిరిగేసే అమ్మాయిగా నవరసాలను ఒలికించింది కరీనా. ఈ చిత్రంలో ఆమెలోని నటనా చాతుర్యం మొత్తం బయటపడిందంటారు. జయాబచ్చన్ ఈ చిత్రంలో కరీనా నటనకు ఫిదా అయిపోయారు.

దేవ్ (2004): గోవింద నిహ్లానీ తీసిన ఈ చిత్రంలో 2002 గుజారత్ అల్లర్ల సమయంలో ఓ బేకరీలో 14 మంది మరణాన్ని కళ్లారా చూసిన జహీరా షేక్ పాత్రతో స్ఫూర్తి పొందిన పాత్రను కరీనా పోషించింది. జరా మరణాలకు సంబంధించి అత్యంత క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పాత్రలో జీవించింది. ఏమాత్రం  మేకప్ వేసుకోకుండా.. కృత్రిమత్వానికి చాలా దూరంగా.. కెమెరా ముందు సజీవంగా నిలబడి చూపించింది.

ఫిదా (2004): ఒకే సంవత్సరంలో వచ్చిన మూడో మణిపూస ఇది. ఇప్పటివరకు కరీనా తన నట జీవితంలో చేసిన ఏకైక నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర ఇది. కెన్ ఘోష్ తీసిన ఈ థ్రిల్లర్ చిత్రంతో కరీనా తన సరదాను తీర్చేసుకుంది. ఫర్దీన్ ఖాన్తో కలిసి.. షాహిద్ కపూర్ను ఆడుకునే సినిమా ఇది. కరీనాను నెగెటివ్ పాత్రలో ఊహించుకోవడం కష్టమే అయినా.. ఆ పనిని ఆమె సమర్థంగా నిర్వర్తించింది.

ఓంకారా (2006): బాధితురాలి పాత్రలు కరీనాకు అంత సులభంగా రావు. షేక్స్పియర్ నాటకం 'ఒథెల్లో'లోని డెస్డెమోనా పాత్రను కరీనా పోషించిన తీరు నభూతో అని చెప్పుకోవాలి. అనుమానం భర్తకు భార్యగా ఆమె ఇందులో నటించింది. చిన్న వయసులోనే చాలా పెద్ద బాద్యతలను తలకెత్తుకుని చూపించింది.

జబ్ వుయ్ మెట్ (2007): అసలు ఈ ఒక్క సినిమా చూస్తే చాలు.. కరీనా అంటే ఏంటో అర్థమైపోతుంది. పూర్తిగా మనసు పెట్టి చేస్తే కరీనా ఎంత గొప్ప నటి అన్న విషయం ఇందులో తెలిసిపోతుంది. ఓంకారా చిత్రంలో తన మౌనంతోనే అన్నీ పలికిస్తే.. ఈ సినిమాలో సుడిగాలిలా అందరినీ చుట్టేస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ యువకుడిని వ్యాపార సామ్రాజ్యాధినేతగా తన మాటలతో మార్చేస్తుంది. అలాంటి అమ్మాయి పక్కనుంటే చాలు.. ప్రపంచాన్నే జయించేస్తామని ప్రతి ఒక్కరూ అనుకుంటారు!!

హీరోయిన్ (2012): మధుర్ భండార్కర్ తీసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టి ఉండొచ్చు గాక.. కానీ పరిశ్రమలో ఒక హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో.. కెరీర్లో ఎత్తు పల్లాలు మనిషిని ఎలా మార్చేస్తాయో, ఎంతకు దిగజారుస్తాయో, చివరికి ఏం చేస్తాయో ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేనంతగా కరీనా చూపించింది. టాప్లో ఉన్నప్పటి పొగరు, అవకాశాల కోసం పరుగులు.. అన్నీ ఇందులో కనిపిస్తాయి.

తలాష్ (2012): ఇన్ని రకాల పాత్రలు పోషించిన తర్వాత.. కరీనా అంతటి అందమైన అమ్మాయి దెయ్యం పాత్ర పోషించకపోతే ఎలా మరి? ఆ సరదా కూడా తలాష్ చిత్రంతో తీర్చేసుకుంది. విషాదభరితమైన గతం ఉన్న ఓ అమ్మాయి చనిపోయి దెయ్యం అయితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.