ఏకమవుతున్న రాజ్‌పుత్‌లు.. పూర్తిగా బ్యాన్‌!

6 Jan, 2018 09:12 IST|Sakshi

జైపూర్‌ : పద్మావతి చిత్ర వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో మరోసారి శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన కన్నెర్ర చేసింది. సెన్సార్‌ బోర్డు ప్యానెల్‌ కమిటీ సూచనలు.. అందుకు మేకర్లు కూడా దాదాపు అంగీకరించారనే వార్తల నేపథ్యంలో ఆందోళనకారులు అప్రమత్తమయ్యారు.  చిత్రాన్ని పూర్తిగా నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

కర్ణిసేన చీఫ్‌ లోకేంద్ర సింగ్‌ కల్వి మీడియాతో మాట్లాడుతూ... ఈ విషయంపై దేశంలోని రాజ్‌పుత్‌ తెగకు చెందిన వారంతా జనవరి 27న చిత్తోర్‌ఘడ్‌లో సమావేశం కాబోతున్నట్లు చెప్పారు. ఆ భేటీలో చిత్ర విడుదలను అడ్డుకునేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘రాణి పద్మావతి త్యాగం వెలకట్టలేనిది.. అలాంటి వ్యక్తిని అభాసుపాలు చేసేలా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకుంటామా?. సినిమా విషయంలో భన్సాలీకే స్పష్టత కొరవడినట్లుంది. ఓసారి చరిత్ర అంటాడు.. మరోసారి కల్పితం అంటాడు. సెన్సార్‌ బోర్డు నిర్ణయం కూడా సముచితంగా లేదు. ఆరు నూరైనా చిత్రాన్ని అడ్డుకుని తీరతాం. ఈ విషయంలో చట్టాలు కూడా మమల్ని అడ్డుకోలేవు. అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం’’ అని ఆయన హెచ్చరించారు.  

చరిత్రను భ్రష్టు పట్టిస్తుంటే నేతలు చూస్తూ ఊరుకోవటం సరికాదని.. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని లోకేంద్ర స్పష్టం చేశారు. కాగా, డిసెంబర్‌ 30న సెన్సార్‌ బోర్డు పద్మావతి చిత్రం గురించి ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి విదితమే. టైటిల్‌ను పద్మావత్‌గా మార్చటంతోపాటు పలు సూచనలు పాటిస్తే యూ బై ఏ సర్టిఫికెట్‌ తో చిత్ర విడుదలకు లైన్‌ క్లియర్‌ చేస్తామని సెన్సార్‌ బోర్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కూడా అంగీకరించారని.. ఫిబ్రవరి 9న చిత్రం విడుదల కాబోతుందని ఓ వార్త కూడా చక్కర్లు కొడుతోంది.  

మరిన్ని వార్తలు