'పద్మావతి' వివాదం.. బద్దలైన థియేటర్‌!

14 Nov, 2017 18:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’  సినిమాక వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన ఓ థియేటర్‌పై దాడి చేసింది. కర్ణిసేన కార్యకర్తలు ఆకాశ్‌ థియేటర్‌పై దాడి చేసి కౌంటర్‌ అద్దాలను, కిటికిలను ధ్వంసం చేశారు. ఆకాశ్‌ థియేటర్‌లో తాజాగా ‘పద్మావతి’ సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ విషయంలో తెలుసుకున్న రాజ్‌పుత్‌ వర్గీయులు కర్ణిసేన ఆధ్వర్యంలో థియేటర్‌పై దాడులకు దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్‌ హోంమంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా స్పందించారు. ప్రజాస్వామికంగా ఎవరైనా నిరసన తెలుపవచ్చునని, కానీ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే.. చట్టప్రకారం చర్యలు తప్పవని కర్ణిసేనను ఆయన హెచ్చరించారు.

రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు.  ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్‌ గోయెల్‌ ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.

డిసెంబర్‌ 1న  విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కర్ణిసేన ఆధ్వర్యంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన సభలో దాదాపు లక్ష మంది రాజ్‌పుత్‌ వర్గీయులు హాజరయ్యారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్‌ కపూర్, అల్లా వుద్దీన్‌ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్‌ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. అయితే, తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు