ఖైదీకి సీక్వెల్‌ ఉంది 

27 Oct, 2019 10:41 IST|Sakshi

చెన్నై : ఖైదీ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని ఆ చిత్ర కథానాయకుడు కార్తీ తెలిపారు. ఈయన మానగరం చిత్రం ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ఖైదీ. డ్రీమ్‌ వారియర్స్‌ ఎస్‌ఆర్‌.ప్రకాశ్, ఎస్‌ఆర్‌.ప్రభు, వివేకానంద ఫిలింస్‌ తిరుపూర్‌ వివేక్‌లు కలిసి నిర్మించిన చిత్రం ఖైదీ.హీరోయిన్, పాటలు, ప్రేమ సన్నివేశాలు లేని యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం ఇది. ఇందులో లారీడ్రైవర్‌గా నటించిన హీరో కార్తీకి, ఇతర పాత్రధారులకు ధరించిన దుస్తులు మినహా మరో దుస్తులు మార్చే అవకాశం ఉండదు. జైలు జీవితాన్ని అనుభవించి విడుదలైన కార్తీ మాసిన గడ్డం, మీసంతో చిత్రం అంతా కనిపిస్తారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఖైదీ చిత్రం దీపావళి పండగ సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చింది. చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది.

ఆ చిత్ర కథానాయకుడు కార్తీ శనివారం మధ్యాహ్నం మీడియాతో తనఆనందాన్ని పంచుకున్నారు. ఒక కొత్త ప్రయత్నానికి మంచి విజయం లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయడానికి తానెప్పుడూ రెడీ అన్నారు. చిత్ర విజయానికి సమష్టి కృషే కారణం అన్నారు. ప్రతి చిత్రం తనకు మంచి అనుభంగా పేర్కొన్నారు. ఏదో ఒక విషయాన్నితెలుసుకోవడమో, నేర్చుకోవడమో జరుగుతుందన్నారు. ఈ ఖైదీ చిత్రం కోసం లారీని నడిపిన అనుభవం మరచిపోలేనన్నారు. లారీని నడపడానికి ముందుగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదని చెప్పారు. వేరే షూటింగ్‌లో ఉండడంతో అంత సమయం కూడా లేదన్నారు. కనీసం షూటింగ్‌ ప్రారంభానికి ముందు తను నడపాల్సిన లారీని కూడా చూడలేదనీ, దర్శకుడే లుక్‌ బాగుందని ఒక లారీని ఎంపిక చేశారని తెలిపారు. దానికి ఇంజిన్, బ్రేకులు లాంటివి కూడా సరిగా లేవన్నారు. అడవిలో రోడ్డుకిరుపక్కల గరుకుగా ఉండే ప్రాంతంలో లారీని నడపడం తనకు సవాల్‌గానే అనిపించిందన్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందనీ, దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ అందుకు కథను కూడా సిద్ధం చేశారని చెప్పారు. ఒక 30 రోజులు కాల్‌షీట్స్‌ తనకు కేటాయించమని ఆయన తనను అడిగారని తెలిపారు. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ ప్రస్తుతం నటుడు విజయ్‌ 64వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని, అది పూర్తయిన తరువాత ఖైదీ– 2 చిత్రం ప్రారంభం అవుతుందని కార్తీ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు