అడంగమరు దర్శకుడితో కార్తీ?

1 Jun, 2019 10:26 IST|Sakshi

అడంగమరు చిత్రం ఫేమ్‌ కార్తీక్‌ తంగవేల్‌కు నటుడు కార్తీ అవకాశం ఇచ్చినట్లు తాజా సమాచారం. నటుడు జయంరవి కథానాయకుడిగా నటించిన చిత్రం అడంగమరు. రాశీఖన్నా నాయకిగా నటించిన ఈ చిత్రం 2018లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడే కార్తీక్‌ తంగవేల్‌.

ప్రస్తుతం కార్తీ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో మలయాళ దర్శకుడు జీతు జోసఫ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ఒకటి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిఖిలావిమల్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో సత్యరాజ్, అమ్ము అభిరామి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఇరుంబుతిరై చిత్ర దర్శకుడు పీఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో కార్తీ నటించనున్నారు.

మానగరం చిత్రం ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కార్తీ నటించిన ఖైదీ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. జూలైలో ఖైదీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా కార్తీక్‌ తంగవేల్‌ దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇంతకు ముందు కార్తీ హీరోగా దేవ్‌ చిత్రాన్ని నిర్మించింది. ఆ చిత్రం ఆడకపోవడంతో కార్తీ ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థకు వెంటనే మరో చిత్రం చేయడానికి కాల్‌షీట్స్‌ ఇచ్చినట్లు తెలిసింది.

వీటితో పాటు కార్తీ, మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలోనూ నటించడానికి సమ్మతించారన్నది గమనార్హం. చాలా నమ్మకం పెట్టుకుని ఇష్టపడి చేసిన రొమాంటిక్‌ లవ్‌స్టోరీతో కూడిన దేవ్‌ చిత్రం నిరాశ పరచడంతో కార్తీ వేగం పెంచేశారు. వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు