అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ

31 Oct, 2019 00:07 IST|Sakshi
ఎస్‌.ఆర్‌. ప్రభు, కార్తీ, రాధామోహన్‌

‘‘ఖైదీ’ సినిమాని ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్‌. ఇంతకు ముందు నన్ను ‘ఆవారా’ కార్తీ అనేవారు.. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లినా ‘ఖైదీ’ కార్తీ అని పిలుస్తుంటే థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు  కార్తీ. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన  యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కేకే రాధామోహన్‌ ఈ నెల 25న విడుదల చేశారు. బుధవారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో కార్తీ మాట్లాడుతూ– ‘‘ఆంధ్ర, తమిళనాడు, కేరళలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మా సినిమాకు మంచి స్పందన వస్తోంది. ‘ఖైదీ’లో ఢిల్లీ (కార్తీ పాత్ర పేరు)లాంటి పాత్ర నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది.

లోకేష్‌ రాసిన, తీసిన విధానం అద్భుతం. నాకు ఒక బామ్మ ఫోన్‌ చేసి, మంచి సినిమా, గొప్ప సినిమా చేశావని ప్రశంసించారు.. అదే నిజమైన సక్సెస్‌. ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చిన ఎస్‌.ఆర్‌. ప్రభుకు థ్యాంక్స్‌. ‘ఖైదీ’ టైటిల్‌ పెడితే సినిమా హిట్‌ అనే సెంటిమెంట్‌ మరోసారి వర్కవుట్‌ అయ్యింది. రవితేజగారు ఫోన్‌ చేసి, ‘ఇటువంటి సినిమా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ‘ఖైదీ 2’ కూడా ఉంటుంది’’ అన్నారు. కేకే రాధామోహన్‌ మాట్లాడుతూ – ‘‘ఈ దీపావళికి ‘ఖైదీ’ వెలుగులు నింపింది. మా సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించింది’’ అన్నారు. ‘‘ఖైదీ’కి భారీ సక్సెస్‌ అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు ఎస్‌.ఆర్‌. ప్రభు.

మరిన్ని వార్తలు