ఒంటెపై స్వారీ చేశా

29 Jun, 2014 23:57 IST|Sakshi
ఒంటెపై స్వారీ చేశా

 బయట ప్రపంచానికి సినిమా ఒక అందమైన కల. ఆ రంగంలోని వారి జీవితాలు భోగభాగ్యం మాయం. ముఖ్యంగా హీరో హీరోయిన్లకు చిటికేస్తే కోరుకున్నవి ఇట్టే చేరువవుతాయి ఇవి సినిమావాళ్లపై సాధారణ ప్రజల భావాలు. అయితే ఏదైనా శ్రమించనిదే సులభంగా సొంతం కాదన్నది కాస్త పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది. సినిమాల కోసం కథానాయకులతోపాటు కథానాయికలు ఒక్కోసారి ప్రాణాంతక సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారన్నది వేరే విషయం. యువ నటి కార్తీక విషయానికొస్తే ఈ సుకుమారి మోటార్ బైక్, జీప్ డ్రైవింగ్ వంటి వాటితోపాటు క్యామెల్ రైడింగ్ కూడా సునాయాసంగా చేసేసి యూనిట్ వర్గాలను ఆశ్చర్యపరిచారట.
 
 ప్రస్తుతం ఈ బ్లాక్ బ్యూటీ పోరంబోకు చిత్రంలో నటిస్తున్నారు. ఆర్య, విజయ్ సేతుపతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.పి.జననాధన్ దర్శకుడు. ఈ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవం అంటున్న కార్తీక ఇటీవలే తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన చిత్రాల అనుభవాలను పంచుకున్నారు. అవేమిటో ఆ ముద్దు గుమ్మ మాటల్లోనే చూద్దాం. పోరంబోకు చిత్రం కోసం చాలా సాహసాలు చేశాను. షూటింగ్ జైసల్మర్‌లో చేశారు. నేను నటించే క్యామెల్ రైడింగ్ సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. చిత్రంలో అది చాలా కీలక సన్నివేశం. వంద ఒంటెలను రప్పించారు.
 
 అందులో ఒక ఒంటె యజమాని స్వారీ ఎలా చెయ్యాలన్న విషయం గురించి కొంత శిక్షణ నిచ్చారు. ఆశ్చర్యమేమిటంటే షూటింగ్ స్పాట్‌లో తీసుకున్న కొద్దిపాటి శిక్షణతోనే ఒంటెపై స్వారీ చేసేశాను. యూనిట్ మొత్తం ఉత్కంఠతో ఆ సన్నివేశాన్ని వీక్షించారు. దర్శకుడు అయితే అంత సహజ సిద్ధంగా నటించడం చూసి విస్మయం చెందారు. మరో విశేషం ఏమిటంటే ఒంటెలు అబ్బాయిలకంటే అమ్మాయిలకు బాగా సహకరిస్తాయట. ఈ విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఆర్య ఒంటెపై స్వారీ చేసే సన్నివేశంలో ఆ ఒంటె ఆయనకు సరిగా సహకరించలేదు. పోరంబోకు చిత్రంలో సాహసంతో కూడిన యాక్షన్ సన్నివేశాల్లో నటించాను.
 
 చిత్రం కోసం బైక్ రైడింగ్ కూడా నేర్చుకున్నాను. నేనిప్పుడు ఏ రకమయిన వెహికల్‌నయినా నడపగలను అని అన్నారు.  ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో దమ్ము చిత్రం తరువాత మరో సారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అల్లరి నరేష్‌కు కవల సిస్టర్‌గా నటిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి చిన్ని కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ పాత్ర సాఫ్ట్‌గా ఉంటే కార్తీక పాత్ర డైనమిక్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో ఈ భామ ఒళ్లు గగుర్పొడిచే పోరాట దృశ్యాల్లో నటించనున్నారట. మొత్తం మీద కార్తీక సాహస నారిగా అవతారమెత్తనున్నారన్నమాట.