5118 ఏళ్ల క్రితం నాటి రహస్యం ఏంటి?

1 Mar, 2020 18:39 IST|Sakshi

యంగ్‌ హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో 2014లో వచ్చిన థ్రిల్లర్‌ చిత్రం ‘కార్తికేయ’. . సరికొత్త కాన్సెప్ట్‌తో తెరపైకి వచ్చిన ఈ సినిమా ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి చిత్రంతోనే పామును హిప్నటైజ్ చేయడమనే కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు చందు మొండేటి. ఈ సినిమా యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ‘కార్తికేయ 2’ పేరిట వస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభానికి ముందు ఒక కాన్సెప్ట్ వీడియోను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది.  ఈ కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే చందు మొండేటి మరో కొత్త విషయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు  అర్థమవుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా ఒక సరికొత్త విషయాన్ని చెప్పబోతున్నారు.

‘కలియుగే ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరత ఖండే. 5118 ఏళ్ల క్రితం ముగిసిన ఒక యుగం. ఆ యుగ అనంత జ్ఞాన సంపద. అందులో దాగి ఉన్న ఒక రహస్యం. ఈ యుగంలో అన్వేషణ. స్వార్థానికొక.. సాధించడానికొక.. అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు? దైవం మనుష్య రూపేణా’’ అంటూ సాగే వాయిస్ ఓవర్‌తో ఈ కాన్సెప్ట్ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది.

‘అర్జున్‌ సురవరం’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రం తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న నిఖిల్‌ తిరిగి కార్తికేయ 2కి శ్రీకారం చుట్టాడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాలభైరవ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా