అప్పుడే నాకంటూ  ఓ మార్క్‌  ఉంటుంది 

11 Jul, 2018 00:28 IST|Sakshi

‘‘నాది హైదరాబాద్‌. వనస్థలిపురంలో నాన్నకు స్కూల్‌ ఉంది. వరంగల్‌ నిట్‌లో ఇంజినీరింగ్‌ చేశా. చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. కాలేజీ అయిపోయాక యాక్టింగ్‌ కోర్సులు చేశా. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశా. కొన్ని సినిమాలు చేసినా అవి రిలీజ్‌ కాలేదు. గతేడాది ఓ సినిమా విడుదలైంది. తాజాగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ చేశా’’ అని హీరో కార్తికేయ అన్నారు. కార్తికేయ, పాయల్‌ రాజపుత్‌ జంటగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’. అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ– ‘‘లవ్‌ స్టోరీ అనగానే కాలేజీ అయిన తర్వాత ఎక్కడో కాఫీ షాప్‌లో లవ్‌ మొదలవుతుందనే ధోరణి అలవాటైంది. లవ్‌ స్టోరీ అంటే ఏంటి? ప్రేమకి ఎలాంటి సమస్యలు రావొచ్చు... అనే విషయాలను చర్చించాం. ఒక మండల హెడ్‌ క్వార్టర్‌లాంటి ప్లేస్‌లో జరిగే సినిమా ఇది. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంలో హీరో పాత్ర మొత్తం యారొగెంట్‌గా ఉంటుంది.

కానీ, మా సినిమాలో ఒక పాయింట్‌ ఆఫ్‌ టైమ్‌లో హీరో చాలా అమాయకంగా ఉంటాడు. హీరోయినే వాడిని డామినేట్‌ చేస్తూ, స్టెప్‌ ఫార్వర్డ్‌ వేస్తుంటుంది. ఇలాంటి స్టేజ్‌ నుంచి ఎక్స్‌ట్రీమ్‌ సైకోనెస్‌కి ఎలా వెళ్లాడన్నదే కథ. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య ప్రయోగాలు వస్తున్నాయి. అయినా ఇంకా కొన్ని పాత ఫార్ములాలోనే ఉంటున్నాయి. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ట్రైలర్‌ విడుదలయ్యాక నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ, నేను ఒప్పుకోలేదు. ఈ సినిమా విడుదలయ్యాక నాకు ఓ డిఫరెంట్‌ ఇమేజ్‌ వస్తుంది. హీరో కావాలి అని వెతుకుతూ ఉన్న కథలు నాకు వద్దు. నన్ను చూసి నాకు మాత్రమే సరిపోయే కథలతో ఎవరైనా వస్తే తప్పకుండా చేస్తా. ఇప్పుడున్న హీరోలందరూ బాగా నటిస్తున్నారు, డ్యాన్స్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆడియన్స్‌ దృష్టి నా మీద పడాలంటే నేను సెలెక్ట్‌ చేసుకునే స్టోరీలు డిఫరెంట్‌గా ఉండాలి. అప్పుడే నాకంటూ ఓ మార్క్‌ తెచ్చుకోగలుగుతాను. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవ డానికి ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు