ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు

13 Aug, 2019 00:32 IST|Sakshi
చైతన్‌ భరద్వాజ్, ప్రవీణ కడియాల, కార్తికేయ, అర్జున్‌ జంధ్యాల

– కార్తికేయ

‘‘గుణ 369’ సినిమా చూసి మా అమ్మ తొలిసారి ఏడవటం చూశాను. ఈ చిత్రం తర్వాత నన్ను చూసి అమ్మ గర్వపడుతోంది. కొందరు మహిళలు నన్ను పట్టుకొని ఏడుస్తుంటే సినిమాకి ఎంత కనెక్ట్‌ అయ్యారో అర్థమైంది’’ అని హీరో కార్తికేయ అన్నారు. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ  కడియాల సమర్పణలో తిరుమల్‌ రెడ్డి, అనిల్‌ కడియాల నిర్మించిన ఈ సినిమా ఈనెల 2న విడుదలైంది.

హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో కార్తికేయ మాట్లాడుతూ–‘‘నా కెరీర్‌లో జీవితాంతం గుర్తు పెట్టుకొనే చిత్రం ‘గుణ 369’. నాకు వస్తున్న ప్రశంసలు చూస్తుంటే భవిష్యత్తులో వంద బ్లాక్‌ బస్టర్‌లు ఇవ్వగలననే ధైర్యం వచ్చింది. ఇకపై నేను ఎంపిక చేసుకునే సినిమా కథల మీద ఈ సినిమా ఇంపాక్ట్‌ ఉంటుంది. ఈ చిత్రంతో బాధ్యతగల నటుడిగా పేరొచ్చింది. ఆ పేరు ఎంత ఖర్చుపెట్టినా రాదు. ఇందుకు నిర్మాతలకు థ్యాంక్స్‌.. దర్శకునికి రుణపడి ఉంటాను’’ అన్నారు. అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ–‘‘గుణ 369’ విడుదల తర్వాత కర్నూలు నుండి వైజాగ్‌ వరకు టూర్‌కి వెళ్లాం.

మంచి సినిమా తీశారు.. హ్యాపీగా ఉన్నామని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమాను యూత్, మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ అభినందిస్తున్నారు. ఏ దర్శకునికైనా ఇంతకన్నా ఏం కావాలి’’ అన్నారు. ‘‘హన్మకొండలో 9నెలల పసికందు శ్రీహితపై అత్యాచారం, హత్య జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ రోజు ఆ పాప తల్లిదండ్రులు జగన్, చరితలు ఫోన్‌ చేసి, ‘గుణ 369’ సినిమా చూసి, ఫోన్‌ చేశాం అని చెబుతుంటే మంచి సినిమా తీశాం అనే ఫీలింగ్‌తో హాయిగా ఉంది. మా చిత్రాన్ని శ్రీహితకు అంకితమిస్తున్నాం’’ అని ప్రవీణ కడియాల అన్నారు.

మరిన్ని వార్తలు