జాక్‌ చనిపోయి ఉండాల్సింది కాదు!

27 Nov, 2017 06:24 IST|Sakshi

‘రోజ్‌... నువ్వు బతకాలి. నాకోసం నువ్వు బతకాలి’. ‘జాక్‌  నువ్వు లేకపోతే నేను బతకలేను. నాకు నువ్వు కావాలి’ ‘రోజ్‌.. నాకు నువ్వు బతకడమే కావాలి.. నన్ను వదిలెయ్‌. నా చేయి వదిలేయ్‌’. రోజ్‌ వదల్లేక వదల్లేక జాక్‌ చేతిని వదిలేస్తుంది. ‘టైటానిక్‌’ సినిమా చివర్లో గాఢ ప్రేమికులు జాక్‌–రోజ్‌ల సంఘర్షణ ఇది. బండరాయిని ఢీ కొని, ప్రమాదానికి గురైన టైటానిక్‌ ఓడ సాక్షిగా సముద్రంలోనే సమాధి అయినవాళ్లు, ప్రాణాలను కాపాడుకున్నవాళ్లూ ఉన్నారు. విరిగిపోయిన ఓ ముక్క మీద రోజ్‌ ఉంటుంది. జాక్‌ మునిగిపోతాడు. వాళ్ల ప్రేమ అలా విషాదంగా ముగిసిపోతుంది.

20 ఏళ్ల క్రితం వచ్చిన ‘టైటానిక్‌’లో లియొనార్డో డికాప్రియో (జాక్‌), కేట్‌ విన్స్‌లెట్‌ (రోజ్‌) తమ నటనతో మైస్మరైజ్‌ చేశారు. సినిమా చూసిన వాళ్లందరూ దర్శకుడు జేమ్స్‌ కేమరూన్‌ కొంచెం కనికరించి, జాక్‌ని బతికించి ఉంటే బాగుండేదనుకున్నారు. కేట్‌ విన్స్‌లెట్‌ మనసులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న కేట్‌ ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. ‘‘విరిగిన ముక్క మీద జాక్‌కి కూడా చోటు ఉంది. కానీ, జేమ్స్‌ కామెరూన్‌ అతన్ని చనిపోయినట్లు చూపించాలనుకున్నారేమో.

ఆ సీన్‌ చేస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, సినిమా విడుదలైన 20 ఏళ్లకు జాక్‌ చేతిని రోజ్‌ వదలాల్సింది కాదు అనిపిస్తోంది’’ అన్నారు కేట్‌. అంత గాఢమైన ప్రేమకథలో నటించారు కాబట్టి.. ‘టైటానిక్‌’ తీస్తున్న సమయంలో ఒకరి పట్ల మరికొరికి ఆకర్షణ ఏదైనా ఉండేదా? అన్న ప్రశ్నకు –‘‘అదేంటో కానీ, మా మధ్య అలాంటిదేం జరగలేదు. అప్పుడు మేమిద్దరం చాలా చిన్నవాళ్లం. సినిమాలో గాఢమైన రొమాంటిక్‌ సీన్స్‌ ఉన్నాయి కాబట్టి, మా మధ్య ఎట్రాక్షన్‌ మొదలై ఉంటుందని ఊహించారు. ఇప్పటికీ ఆ ఊహలోనే ఉన్నారు. బట్‌.. సారీ మా మధ్య అలాంటిదేం లేదు. 20 ఏళ్లుగా మేం మంచి స్నేహితులుగా ఉండిపోయాం’’ అన్నారు కేట్‌ విన్స్‌లెట్‌.

మరిన్ని వార్తలు