‘ కాంతారావు’ బయోపిక్‌

28 May, 2018 06:49 IST|Sakshi
కాంతారావు ఇంట్లో వివరాలు సేకరిస్తున్న డైరెక్టర్‌ ఆదిత్య, కాంతారావు స్నేహితుడితో మాట్లాడుతున్న ఆదిత్య

పీసీ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న కాంతారావు

జీవిత చరిత్ర వివరాలు తెలుసుకునేందుకు గుడిబండ వచ్చిన దర్శకుడు

‘సాక్షి’ కథనానికి మంచి స్పందన వచ్చిందన్న ఆదిత్య

కోదాడరూరల్‌ : సినీ నటుడు టీఎల్‌ కాంతారావు జీవితచరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. కాంతారావు బయోపిక్‌కు దర్శకుడు దాదాసాహెబ్‌పాల్కే, నంది అవార్డుల గ్రహీత డాక్టర్‌ పీసీ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌తో సమానంగా వెలుగొందిన గొప్పనటుడిపై బయోపిక్‌ను తీసేందుకు 50శాతం వివరాలు సేకరించానని మిగిలిన వివరాల కోసం ఆయన స్వగ్రామం వచ్చానని దర్శకుడు ఆదిత్య తెలిపారు. కాంతారావు జీవిత చరిత్ర తెలుసుకునేందుకు ఆదివారం దర్శకుడు ఆదిత్య కోదాడ మండలం గుడిబండ గ్రామానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయనవ విలేకరులతో మాట్లాడారు. కాంతారావు జీవితాన్ని రెండు కోణాల్లో చంద్రదివ్య ఫిలీం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘అనగనగా ఓ రాకుమారుడు’ అనే చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నామని తెలిపారు.

సినీ ఇండస్ట్రీలో కాంతారావు 1950 నుంచి 1971 వరకు గల స్వర్ణయుగం.. ఆ తర్వాత  కష్టాకాలంపై రెండుగంటల నిడివి గల సినిమా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ పాత్రలతో పాటు బి.విఠాలాచార్య, హీరోయిన్‌లు కృష్ణకుమారి, రాజశ్రీ పాత్రలు ఉంటాయన్నారు. ఇప్పటికే కాంతారావు కుటుంబ సభ్యులతో, పెద్దకుమారుడు ప్రతాప్‌తో సినిమా కథపై చర్చించనని అ న్నారు. దీనిలో భాగంగానే స్వగ్రామంలో ఆయన గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.

అనంతరం దర్శకుడు ఆదిత్య కాంతారావు ఇంటి వరండాలో కూర్చొని గ్రామస్తులు, ఆయన జీవితాన్ని చూసిన వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసుల సత్యనారాయణ పలు ఆసక్తికర విషయాలను దర్శకుడికి వివరించారు. ఈ చిత్ర నిర్మాణానికి గ్రామస్తులు, ఆయన అభిమానుల సహా కారం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానికులు తూమాటి వరప్రసాద్‌రెడ్డి, యరగాని లక్ష్మయ్య, బాలేబోయిన సిద్దయ్య,  పోలోజు నర్శింహచారి, వెంకటాచారి, శ్రీనివాసుల ప్రసాద్‌రెడ్డి, కుక్కడుపు సైదులు  గ్రామ ప్రజలు ఉన్నారు.

ఆనందంలో గ్రామస్తులు..

తమ గ్రామం నుంచి సినీ రంగంలో ఆనాటి అగ్రనటులతో సమానంగా ఓ వెలుగు వెలిగిన మా కత్తి కాంతారావు జీవిత చరిత్ర సినిమా తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఆయన తీసిన ప్రతి సినిమాను చూసేవారిమని అన్నారు. గ్రామం నుంచి ఆయన వద్దకు సాయం కోరి వెళితే కాదనకుండా ఇచ్చేవారని తెలిపారు. సినిమా నిర్మాణానికి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

గొప్ప దర్శకుడి చేతిలోకే సినిమా..

కాంతారావు బయోపిక్‌ని సినిమా తీసే డైరెక్టర్‌ పీసీ ఆదిత్య 100 రోజుల్లో 100 షార్ట్‌ఫిల్మ్‌లు తీసి 2015లో దాదాసాహెబ్‌ పాల్కే అవార్డును అందుకున్నారు. దీనికిగానూ సింగపూర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ డాక్టరేట్, లిమ్కాబుక్‌లో పేరు కూడా సంపాదించాడు. తెలుగు చిత్రసీమలో ఏఎన్‌ఆర్‌ తర్వాత ఆదిత్యకు ఆ తర్వాతే కళాతపస్వీ విశ్వనాథ్‌గారికి వచ్చింది. పిల్లలుకాదు పిడుగులు సినిమాకు 2004 ఉత్తమ బాలలచిత్ర కేటగిరికిలో నంది అవార్డు కూడా పొందారు.

‘సాక్షి’ కథనానికి మంచి స్పందన వచ్చింది..

ఈనెల 19న సాక్షి ఫ్యామిలీ పేజీలో వచ్చిన కాంతారావు బయోపిక్‌ వార్తాకు ఉమ్మడి రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి ఆయన అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిందని దర్శకుడు ఆదిత్య తెలిపారు. సాక్షిలో వచ్చిన వార్తాను చూసిన ఆయన అభిమానులు అనేకమంది ఫోన్‌ చేశారని సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నారని కావాల్సిన సహాయ సకారాలు అందజేస్తామని తెలిపారని అన్నారు.

మరిన్ని వార్తలు