అవార్డులపై నమ్మకం పోతుంది : కత్తి మహేష్

16 Nov, 2017 13:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా విషయంపై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజంగా ప్రతిభకు తగ్గట్లు అవార్డులు ఇచ్చారా ఆయన ప్రశ్నించారు. అవార్డులు ఇచ్చేవాడు మనవాడయితే ఎలాంటి సినిమా తీసినా పర్వాలేదేమో అంటూ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు నెటిజన్లు ఏపీ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నంది అవార్డుల ఎంపికను విమర్శిస్తున్నారు. ఆ సినిమాలకు పలానా కేటగిరీలో ఎందుకు అవార్డులు ఇచ్చారన్నదానిపై కనీసం రెండు పేరాగ్రాఫ్ సమాచారం ఇవ్వాలన్నారు మూవీ క్రిటిక్ మహేశ్‌ కత్తి. అప్పుడైతే అవార్డు పలానా సినిమాకు ఎందుకిచ్చారో అర్థమవుతుందని, లేని పక్షంలో ఇండస్ట్రీతో పాటు ప్రజల్లోనూ అవార్డులపై నమ్మకం పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వాస్తవం చెప్పాలంటే.. ఎవడే సుబ్రమణ్యం సూపర్ మూవీ. కానీ సామాజిక అంశాలున్న ఆ మూవీకి ఏ అవార్డు ఇచ్చారో చూడండి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు లాంటి కీలక అవార్డులు రావాల్సిన మూవీకి ద్వితీయ ఉత్తమ చిత్రం, తొలి చిత్ర దర్శకుడు అంటూ ఏదో ఇవ్వాలంటూ నామమాత్రంగా అవార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. లెజెండ్ మూవీకి తొమ్మిది అవార్డులిచ్చారు. అన్ని అవార్డులు ఎందుకిచ్చారో ఏపీ ప్రభుత్వం విశ్లేషించుకోవాలి. ఉత్తమ చిత్రం అవార్డు రావాల్సిన 'మనం' మూవీకి ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డుతో సరిపెట్టారు. అవార్డులు ఇస్తున్నామంటే ఎన్నో ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అవార్డ్ జ్యూరీ సభ్యులు, ప్రభుత్వం, ఇతరత్రా యంత్రాంగం గుర్తించాలి. ఇక్కడ అవార్డులు వచ్చిన ఏ మూవీకి జాతీయ, ఇతర సినీ అవార్డుల్లో అవార్డులు రావడం లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మూడేళ్లకోసారి అవార్డులు ఇవ్వడం కంటే ప్రతి ఏడాది సంబంధిత అవార్డులు ఇస్తే ప్రేక్షకులకు ఓ అవగాహన వస్తుందన్నారు.

మరిన్ని వార్తలు