తండ్రీకూతుళ్ల మధ్య ఆప్యాయత

14 Mar, 2019 03:22 IST|Sakshi
సత్యనారాయణ, ఐశ్వర్య, భీమనేని శ్రీనివాసరావు, కేయస్‌ రామారావు

రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీక్‌ రాజు, ‘వెన్నెల’ కిషోర్‌ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. క్రికెటర్‌’. కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమా రాజమండ్రిలో ప్రారంభమైంది. కార్తీక్‌రాజు, ఐశ్వర్యా రాజేష్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు, ఎం.పి. మురళీమోహన్‌ క్లాప్‌ ఇవ్వగా, ఈస్ట్‌ గోదావరి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌ సత్యనా రాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ఆప్యాయత, అనుబంధం, వాత్సల్యాన్ని చాటి చెప్పే సినిమా ఇది. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఈ సినిమాలో ఉన్న నావెల్టీ. ఫిమేల్‌ క్రికెటర్‌గా ఐశ్వర్యా రాజేష్‌ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది? అనేది ఈ సినిమాలోని ప్రధాన ఇతివృత్తం’’ అన్నారు. కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ– ‘‘విజయ్‌ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను.

ఆ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఐశ్వర్య ఒక టీజర్‌ చూపించింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. క్రికెటర్‌గా బౌలింగ్, బ్యాటింగ్‌ అద్భుతంగా చేసింది. తర్వాత ఆ కథ చెప్పి, ఆ రైట్స్‌ కొనిపించి తెలుగులో నన్నే తియ్యమని చెప్పింది. అలా ఈ సినిమా మొదలవడానికి తనే కారణం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ధిబునినన్‌ థామస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు.

మరిన్ని వార్తలు