మొత్తం కుటుంబంతో కలిసి సిన్మా చేయాలి!

3 Sep, 2018 20:30 IST|Sakshi

సాక్షి, తమిళసినిమా: మనిషి కలలు కనడం ఎంత సహజమో, ఆశపడటం అంతకంటే సహాజం. ఇంతకీ ఈ కహానీ ఎందుకంటారా? యువ నటి కీర్తీసురేశ్‌ అలాంటి అరుదైన కార్యం కోసం ఆశపడుతోంది. నటిగా ఈ బ్యూటీ కేరీర్‌ మహానటి చిత్రానికి ముందు ఆ తరువాత అన్నట్టుగా మారిపోయింది. అప్పటి వరకూ కమర్షియల్‌ చిత్రాలతో విజయపథంలో దూసుకుపోతున్న కీర్తి.. మహానటి చిత్రంతో అభినేత్రి అనేంతగా పేరు తెచ్చుకుంది. ఆ చిత్రంలో నటి సావిత్రి పాత్రలో అవలీలగా ఒదిగిపోయిన కీర్తీసురేశ్‌ తాజాగా కమర్షియల్‌ హీరోయిన్‌ బాణీకి మారిపోయింది. ప్రస్తుతం తను విజయ్‌కు జంటగా సర్కార్, విశాల్‌ సరసన సండైకోళి-2, విక్రమ్‌తో సామి స్క్వేర్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో విశాల్‌తో రొమాన్స్‌ చేసిన సండైకోళి-2 చిత్రం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆ తరువాత సామీ స్క్వేర్‌, ఆపై సర్కార్‌ అంటూ ఈ అమ్మడు నటించిన చిత్రాలు అభిమానులను ఎంటర్‌టెయిన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి.

ఇవి కాకుండా కొత్త చిత్రాలను ఇప్పటివరకు అంగీకరించని కీర్తీసురేశ్‌ సినిమా కుటుంబం నుంచి వచ్చిన నటి అన్న విషయం తెలిసిందే. తండ్రి సురేశ్‌ మాలీవుడ్‌లో ప్రముఖ చిత్ర నిర్మాత, తల్లి మేనక ఒకప్పటి నటి. ఈమె రజనీకాంత్‌ సరసన పుదుకవితై అనే చిత్రంలో నటించారన్నది గమనార్హం. ఇక కీర్తీ అమ్మమ్మ నటినే. ఆమె ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఇటీవల కార్తీ హీరోగా నటించిన ‘కడైకుట్టి సింగం’ చిత్రంలోనూ కీర్తి అమ్మమ్మ నటించారు. తాజాగా చారుహాసన్‌తో కలిసి నటించిన ‘దాదా 87’ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. అదే విధంగా కీర్తీసురేశ్‌ సోదరి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్స్‌ చేసింది. ఇంతకీ కీర్తీసురేశ్‌ ఆశ పడే విషయం ఏమిటంటే.. నాన్న నిర్మాతగా తన అక్క దర్శకత్వంలో  రూపొందించే సినిమాలో తానూ, అమ్మా, బామ్మ కలిసి నటించాలనుందని ఉందని కీర్తి పేర్కొంది. కీర్తీకి తన ఆశను నెరవేర్చుకోవడం పెద్ద పనేమీ కాదు. కాబట్టి తన కుటుంబం చేసే చిత్రాన్ని మనం చూసే అవకాశం లేకపోలేదు. అయినా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! దర్శకులూ ఇంకెందుకు ఆలస్యం కీర్తీ కుటుంబం కోసం కథకు పదును పెట్టే పనిలో పడిపోతే పోలా!

మరిన్ని వార్తలు