కథ బాగుంటే చాలు

16 May, 2019 08:00 IST|Sakshi

చెన్నై : అలాంటి అవకాశం కూడా లేకుండా పోతోంది అని అంటోంది నటి కీర్తీసురేశ్‌. చాలా తక్కువ కాలంలో ఎక్కువ పేరును తెచ్చుకున్న నటి కీర్తీసురేశ్‌. దక్షిణాదిలో విజయపరంపరను కొనసాగిస్తూ ఉత్తరాది చిత్ర పరిశ్రమలో అదృష్టం పరిక్షించుకోవడానికి అక్కడ మకాం పెట్టిన కీర్తీసురేశ్‌ తన సక్సెస్‌ రహస్యాన్ని బయట పెట్టింది. తన సినీ జీవితం గురించి కీర్తీసురేశ్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సినిమా రంగంలో నిలదొక్కుకోవడం తన అదృష్టంగా పేర్కొంది. ప్రతిభావంతులెందరో ఉండగా మహానటి చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం తనను వెతుక్కుంటూ రావడం అదృష్టం అనకుండా ఎలా ఉంటానని అంది.

ఆ చిత్ర కథను అర్థం చేసుకుని కష్టపడి నటించానని, అందుకు ఫలం అనుభవించానన్న ఆనందాన్ని వ్యక్తం చేసింది. నిజం చెప్పాలంటే తన గురించి తాను వెనక్కు తిరిగి ఆలోచించుకునే టైమ్‌ కూడా లేదని చెప్పింది. తాను నటించిన చిత్రం విడుదలైన తరువాత అందులో ఎలా నటించాను, అంత కంటే ఇంకా బాగా నటించవచ్చా అని ఆలోచించడానికి కూడా టైమ్‌ ఉండడం లేదని అంది. అయితే కథల ఎంపికలో మాత్రం శ్రద్ధ చూపుతున్నానని తెలిపింది. అందులోనూ కథ వినగానే అందులో తన పాత్ర ఏమిటన్నది కాకుండా కథ బాగుందా? అన్నదాని గురించే ఆలోచిస్తానని చెప్పింది. కథ బాగుంటే అందులో తానుంటే చాలు అని భావిస్తానని అంది.  చిత్ర విజయానికి కథే ముఖ్యం అని పేర్కొంది. ఆ తరువాతనే తన పాత్ర గురించి ఆలోచిస్తానని చెప్పింది. కథల ఎంపికలో తన తారక మంత్రం ఇదేనని కీర్తీసురేశ్‌ చెప్పింది. అన్నట్టు చిన్న గ్యాప్‌ తరువాత ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటించనున్న చిత్రంలో యువ నటుడు ఆదితో రొమాన్స్‌ చేయనుంది.

మరిన్ని వార్తలు