నాని లోకల్.. కీర్తి నాన్ లోకల్!

10 Aug, 2016 23:39 IST|Sakshi
నాని లోకల్.. కీర్తి నాన్ లోకల్!

‘సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. చంటిగాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. లోకల్’ అనేది ‘ఇడియట్’లో రవితేజ సూపర్‌హిట్ డైలాగ్. ఇప్పుడు నాని ‘నేను లోకల్’ అంటున్నారు. నాని, కీర్తీ సురేశ్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రానికి ‘నేను లోకల్’ టైటిల్ ఖరారు చేశారు. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్... అనేది ఉపశీర్షిక.
 
 ఓ లోకల్ అబ్బాయి, నాన్‌లోకల్ అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం కూడా ‘ఇడియట్’ తరహాలో ఉంటుందట. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమేరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. అనంతరం నాని మాట్లాడుతూ - ‘‘విభిన్నమైన వినోదాత్మక ప్రేమకథా చిత్రమిది. నాకు సమానమైన పాత్రలో నవీన్‌చంద్ర నటిస్తున్నారు’’ అన్నారు.
 
 త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ - ‘‘పక్కింటి కుర్రాడి తరహా పాత్రలో నాని, మన ఇంట్లో అమ్మాయిలా కీర్తి సురేశ్, కీలక పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తారు. ‘దిల్’ రాజు, నాని, దేవిశ్రీ ప్రసాద్.. ముగ్గురితో పనిచేయాలనే కోరిక ఈ ఒక్క చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ - ‘‘మాస్ ఎంటర్‌టైనర్ ఇది. ‘ఆర్య’ తరహాలో క్యారెక్టర్ బేస్డ్ లవ్‌స్టోరీ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: ప్రసన్న, కెమేరా: నిజార్ షఫీ, అసోసియేట్ నిర్మాత: బెక్కం వేణుగోపాల్, సహ నిర్మాత: హర్షిత్‌రెడ్డి.