గుర్తింపు తమిళసినిమాతోనే!

14 Jan, 2019 07:56 IST|Sakshi

సినిమా: నటిగా నాకు గుర్తింపునిచ్చింది తమిళసినిమానేనని నటి కీర్తీసురేశ్‌ పేర్కొంది. మహానటి చిత్రంతో అన్ని వర్గాల వారి మనసుల్లోనూ చోటు సంపాదించుకుని ప్రశంసల జల్లుల్లో పులకరించిన ఈ బ్యూటీ కమర్శియల్‌ చిత్రాల్లోనూ మంచి పేరే తెచ్చుకుంటోంది. కేరళకు చెందిన కీర్తీసురేశ్‌ది సినీ కుటుంబం అన్న విషయం తెలిసిందే. మాతృభాషలో నటనకు శ్రీకారం చుట్టిన ఈ భామ ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లోనూ తనదైనముద్రవేసుకుంటోంది. ఇటీవల కోలీవుడ్‌లో సర్కార్, సామి స్క్వేర్, సండైకోళీ–2 చిత్రాల్లో వరుసగా నటించిన కీర్తీసురేశ్‌కు ప్రస్తుతం ఇక్కడ ఒక్క చిత్రం కూడా చేతిలో లేదు. విశ్రాంతి లేకుండా నటించిన తాను కొంత విరామం కోరుకుంటున్నానని చెప్పింది. అయితే మలయాళంలో ఒక చిత్రం, తెలుగులో మరొక చిత్రం చేస్తూ ఖాళీ అంటూ లేకుండానే నటిస్తోంది. మధ్య, మధ్యలో వాణిజ్య ప్రకటనల్లో, కొత్త దుకాణాలకు రిబ్బన్‌ కటింగ్‌లకు వెళుతూ ఆ విధంగానూ ఆదాయాన్ని గడించేస్తోంది. అలా ఇటీవల తమిళనాడులో సందడి చేసిన కీర్తీసురేశ్‌ మీడియా ముందుకు వచ్చింది. ఆ ముచ్చట్లేంటో చూద్దామా? నేను నటిగా మలయాళంలో పరిచయం అయినా గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం తమిళసినిమానే.

నిజం చెప్పాలంటే చదువుకునే రోజుల్లో నాకు నటనపై ఆసక్తిలేదు. మోడలింగ్‌ రంగంలోకి వెళ్లాను. అయితే దేవుడి అనుగ్రహంతో సినిమా నటిగా మారాను. మలయాళంలో ఒక చిత్రం చేయగానే కోలీవుడ్‌లో అవకాశం విచ్చింది. నటిగా శ్రమించే ఈ స్థాయికి చేరుకున్నాను. తమిళసినిమా గురించి చెప్పాలంటే కొత్త కొత్త దర్శకులు పరిచయం అవుతూ వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులూ చాలా తెలివిగా ఉన్నారు. మంచి చిత్రాలను కచ్చితంగా ఆదరిస్తున్నారు. నేను సాధ్యం అయినంత వరకూ మంచి కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. ఇందుకోసం తీవ్రంగా కృషిచేస్తున్నాను. కోలీవుడ్‌లో విజయ్‌ లాంటి స్టార్స్‌తో నటించాను. అజిత్‌తోనూ నటించాలన్న ఆశ ఉంది. అలాంటి అవకాశం వస్తే జారవిడుచుకోను. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని చాలా మంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేదు. అందుకు చాలా సమయం ఉంది. అదేవిధంగా రాజకీయాల గురించి అడుగుతున్నారు. వాటిపై కొంచెం కూడా ఆశ లేదు. నటిగానే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అని కీర్తీసురేశ్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా