ప్రతి అమ్మాయి కనెక్ట్‌ అయ్యే కథతో...

11 Jan, 2019 00:13 IST|Sakshi
కల్యాణ్‌ కోడూరి, నరేంద్ర, కీర్తీ సురేశ్, కల్యాణ్‌ రామ్, మహేశ్‌ కోనేరు

‘మహానటి’ తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో కీర్తీ సురేశ్‌పై అభిమానం అమాంతం పెరిగింది. ఇప్పుడు ఓ ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాలో నటించనున్నారామె. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నరేంద్ర దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు నిర్మించనున్నారు. ఈ సినిమా ముహూర్తం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బీవీయస్‌యన్‌ ప్రసాద్, దర్శకుడు వెంకీ అట్లూరి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో కల్యాణ్‌ రామ్‌ క్లాప్‌ ఇచ్చారు. ఫస్ట్‌ షాట్‌కి దర్శకుడు హరీష్‌ శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కీర్తీ సురేశ్‌ మాట్లాడుతూ – ‘‘తెలుగులో ‘మహానటి’ తర్వాత నటిస్తోన్న సినిమా ఇది. ఫీమేల్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది. ప్రతి అమ్మాయి కనెక్ట్‌ అయ్యే చిత్రమిది.

సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం అమెరికాలో జరగనుంది. దర్శకుడు నరేంద్ర మంచి కథ సిద్ధం చేశారు. తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతాననే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘2016 నుంచి ఈ కథను తయారు చేస్తున్నాను. అన్ని ఎమోషన్స్‌ ఇందులో ఉంటాయి. ఈ పాత్రకు కీర్తీగారు తప్ప ఇంకెవరూ సూట్‌కారు. 75శాతం షూటింగ్‌ అమెరికాలో జరుగుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అన్నారు దర్శకుడు నరేంద్ర. ‘‘మహానటి’తో కీర్తి తెలుగు ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్‌ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి అమ్మాయి ఏదో సందర్భంలో ఎదుర్కొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. మిగతా నటీనటులను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత మహేశ్‌ కోనేరు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణ్‌ కోడూరి పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు