కార్తీక్‌ సుబ్బరాజ్‌ చిత్రంలో కీర్తీసురేశ్‌

10 May, 2019 10:19 IST|Sakshi

యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ చిత్రంలో యువ నటి కీర్తీసురేశ్‌ నటించబోతున్నారన్న టాక్‌. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. నిజానికి కీర్తీసురేశ్‌ కోలీవుడ్‌ చిత్రాల్లో నటించి చాలా కాలమైందని చెప్పవచ్చు. సర్కార్‌ చిత్రం తరువాత ఈ చిన్నది తమిళంలో నటించలేదు. అంతకు ముందు స్వామీ స్క్వేర్, సండైకోళి–2, సర్కార్‌ చిత్రాలతో పాటు తెలుగులో మహానటి వంటి చిత్రాలతో క్షణం తీరిక లేకుండా నటించేసిన కీర్తీసురేశ్‌ నటనకు కాస్త విరామం తీసుకోనున్నట్లు ప్రకటించారు.

అయితే మలయాళంలో నటిస్తూనే ఉన్నారు. ఇక తెలుగులోనూ ఈ బ్యూటీకి అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ హిందీ చిత్రాల నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ కీర్తీసురేశ్‌ను బాలీవుడ్‌కు ఆహ్వానించారు. అక్కడ ఆయన నిర్మించనున్న చిత్రంలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా నటించే అవకాశాన్ని కల్పించారు. విశేషం ఏమిటంటే ఆ చిత్రంలో కీర్తీసురేశ్‌ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

అలా బాలీవుడ్‌లో ఎంట్రీతోనే ద్విపాత్రాభినయం చేస్తున్న తొలి దక్షిణాది బహుశా నటి కీర్తీసురేశే అయి ఉంటారు. ఈ చిత్రాన్ని అమిత్‌శర్మ తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా మాతృభాష మలయాళంలో ప్రియదర్శన్‌ దర్శకత్వంలో మరక్కార్‌ అబిరక్కడలిండె సింహం అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు.  ఈ మూవీలో మోహన్‌లాల్, సునీల్‌శెట్టి, సుధీప్, అర్జున్, ప్రభు, మంజువారియర్, నెడుముడి వేణు, సుహాసిని మణిరత్నం వంటి స్టార్స్‌ నటిస్తున్నారు.

వీటితో పాటు తెలుగులో నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఒక చిత్రం, నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ఒక చిత్రం అంటూ బిజీగా నటిస్తున్నారు. ఇలా చూస్తే కీర్తీసురేశ్‌ నటించిన ఒక్క తమిళ చిత్రం కూడా ఈ ఏడాది తెరపైకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. తాజాగా ఒక తమిళ చిత్ర అవకాశం కీర్తీని వరించిందని తెలిసింది. సూపర్‌స్టార్‌కు పేట వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్నిచ్చిన యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ నటి కీర్తీసురేశ్‌ను తన చిత్ర కథానాయకిగా ఎంచుకున్నట్లు తెలిసింది.

అయితే ఇది ఆయన దర్శకత్వం వహించే చిత్రం కాకుండా సొంతంగా నిర్మించే చిత్రం అవుతుంది. తన స్టోన్‌ బెంచ్‌ పతాకంపై ఒక కొత్త దర్శకుడికి కార్తీక్‌సుబ్బరాజ్‌ అవకాశం కల్పిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే ఇదీ హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంగా ఉంటుందట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారికపూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు