అది నాకు తెలుసు!

12 Sep, 2019 08:21 IST|Sakshi
కీర్తీసురేశ్‌.

సినిమా: మహానటిలో సావిత్రిగా జీవించిన నటి కీర్తీసురేశ్‌. అలాంటి మరో చిత్రం ఆమె కెరీర్‌లో వస్తుందని చెప్పలేం. ఆ చిత్రం తమిళంలోనూ నడిగైయార్‌ తిలగం పేరుతో విడుదలై సక్సెస్‌ అయ్యింది. అంతకు ముందు కూడా ఇక్కడ స్టార్‌ హీరోలతో వరుసగా చిత్రాలు చేసింది. అంతే కాదు గత ఏడాది ఈ బ్యూటీ చేసిన 8 చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు.  ఇటీవల కీర్తీసురేశ్‌ ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు. అందుకు కారణం ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా చేయకపోవడమే. త్వరలో దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ నిర్మించనున్న చిత్రంలో నటించనుంది. కాగా మాతృభాష మలయాళంలో మరక్కయార్‌ అనే చిత్రం, తెలుగులో మిస్‌ ఇండియా, హిందీలో మెయ్‌టన్‌ ఇలా మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉంది. మెయ్‌టన్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంటర్‌ అవుతోంది. అందుకోసం చాలా కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైంది. ఇక తెలుగులో నటిస్తున్న మిస్‌ ఇండియా హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంగా ఉంటుంది. త్వరలో నటించనున్న తమిళ చిత్రం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రమే. 

చాలా గ్యాప్‌ తరువాత నటి కీర్తీసురేశ్‌ మీడియా ముందుకొచ్చింది. ఇటీవల ఒక మీడియాతో తన భావాలను పంచుకుంది. అవేంటో చూద్దామా.. తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తనకు ఉంటుంది. అలాగని అనవసరంగా మనకు తెలిసినవన్నీ బయటకు చెప్పాలనుకోవడం నాకు నచ్చదు. ఇక పనిలేకుండా ఖాళీగా కూర్చోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. సినిమా రంగంలో అవకాశాలు వరించడం గొప్ప విషయమే. అందుకే విరామం లేకుండా ఏదో ఒక పనిచేస్తుండాలి. అలాగని  వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకోవడం నాకిష్టం ఉండదు. సినిమా రంగంలోనే పుట్టి పెరిగిన అమ్మాయిని. మా అమ్మానాన్నల ఒడిలో కూర్చుని సినిమాలు చూస్తూ ఎదిగాను. నటన విషయంలోనూ, కథలను ఎంపిక చేసుకునే విషయంలోనూ పరిపక్వత కలిగిన నటిని. అయితే నాకంతా తెలుసన్న గర్వం మాత్రం లేదు. ఎక్కడ ఎలా నడుచుకోవాలో అక్కడ అలా నడుచుకుంటాను. సినిమా విషయంలో తుది నిర్ణయం దర్శకుడిదే. వారి భావాలకనుగుణంగా మేము పయనిస్తే చాలు అంతా బాగానే జరుగుతుంది అని కీర్తీసురేశ్‌ పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు