టైమ్‌లీ కిల్లింగ్ వీరప్పన్

7 Jan, 2016 23:14 IST|Sakshi
టైమ్‌లీ కిల్లింగ్ వీరప్పన్

   కొత్త సినిమా గురూ!
కళ... జీవితాన్ని అనుకరిస్తుంది అంటారు. అనుకరణతో సరిపెట్టకుండా ఏకంగా నిజజీవితాన్నే కళారూపంలో చూపెట్టదలిస్తే..? రియాలిటీ ఎక్కువైతేనేమో కళ పాళ్ళు తగ్గాయనీ, కళాపోషణ ఎక్కువైతేనేమో వాస్తవ విరుద్ధ మనీ కంప్లయింట్లు వస్తాయి. ఇదో కత్తి మీద సాము. ‘సర్కార్’, ‘సర్కార్‌రాజ్’, ‘రక్త చరిత్ర’ లాంటి రియల్‌లైఫ్ స్టోరీలతో ఆకట్టుకున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తరచూ ఈ సాముకు సిద్ధపడుతుంటారు. ప్రభుత్వాల్ని గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ (1952- 2004)పై ఇప్పుడు సినిమా తీశారు. కన్నడలో జనవరి1నే రిలీజైన ఈ ‘కిల్లింగ్ వీరప్పన్’ 6 రోజులు ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది.
 
 
 వీరప్పన్ ఆచూకీ తెలిసి, అతణ్ణి చంపడా నికి పోలీస్ అధికారి (ప్రముఖ నిర్మాత ‘రాక్‌లైన్’ వెంకటేశ్) బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది. వీరప్పన్, అతని అనుచరులు మాటువేసి, ఆ ఆఫీసర్ బృందాన్ని చంపేస్తారు. అప్పటికే పలువురు ఉన్నతాధికా రుల్ని పోగొట్టుకున్న ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ (ఎస్టీయఫ్) నుంచి హీరో (కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్) రంగంలోకి దిగుతారు. శ్రీయ (పారుల్ యాదవ్) అనే అమ్మాయి ద్వారా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి (యాజ్ఞాశెట్టి)ని నమ్మించి, వీరప్ప న్‌ను పట్టుకోవాలనుకుంటారు. ఆ ప్లాన్ వీరప్పన్‌కి తెలిసిపోయి, ఫెయిలవుతుంది. ఆ తర్వాత ఎన్నెన్ని ప్లాన్‌‌స వేసి, ఆ పోలీసు అధికారి వీరప్పన్‌ను మట్టుపెట్టాడన్నది మిగతా సినిమా.
 
 
 ఏళ్ళపాటు తమిళనాడు, కర్ణాటకల్లో పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్‌ను ఎస్టీయఫ్ చీఫ్ విజయ్‌కుమార్ ఆపరేషన్ కుకూన్‌తో మట్టుబెట్టిన రియల్‌స్టోరీ పత్రికల్లో చదివాం. అయితే, బయటకు వెల్లడించలేని మార్గాల్లో సేకరించిన విశేషాలు, అందరికీ అందుబాటులో ఉన్న విస్తృత సమాచారం ద్వారా ఈ చిత్ర కథను వర్మ అల్లుకున్నారు. ఆ సంగతి సినిమా మొదట్లోనే వర్మ ప్రకటించారు.
 
 టైటిల్స్‌లో ‘దిస్ ఈజ్ ది ట్రూత్... యాజ్ ఐ నో ఇట్’ అని తెలిపారు. తనకు తెలిసిన నిజమంటూనే, తెరపై అంతా నిజమనిపించేలా చూపడంలోనూ సక్సెసయ్యారు. ఎల్టీటీఈతో వీరప్పన్ పెంచుకోవాలనుకున్న బంధం, రజనీకాంత్, కంచి స్వామి సహా ప్రముఖుల కిడ్నాప్‌కు అతని ప్లాన్ లాంటి తెర వెనుక కబుర్లు కొన్ని చూపెట్టారు. ‘కిల్లింగ్ వీరప్పన్’ అని పెట్టుకున్న టైటిల్‌కు తగ్గట్లే ఈ సినిమా- మొదటి నుంచి చివరి దాకా వీరప్పన్‌ను పోలీసులు ఎలా హతమార్చారన్న దాని మీదే ఉంటుంది!
 
 ‘‘ఆసియా మొత్తానికి అతి పెద్ద క్రిమినల్ ఆపరేషన్ అసలు కథ’’గా ప్రచారమైన ఈ చిత్రంలో వీరప్పన్ కథాకమామిషు, ప్రముఖ కన్నడ హీరో రాజ్‌కుమార్ కిడ్నాప్ ఉదంతం లాంటివన్నీ జనానికి ఆల్రెడీ తెలుసన్న పద్ధతిలో కథ సాగుతుంది. మధ్య మధ్య డైలాగులు, రెండు, మూడు చిన్న చిన్న ఫ్లాష్‌బ్యాక్‌లతో వీరప్పన్ చేసిన పనుల్ని తెరపై ప్రస్తావిస్తారు, చూపెడతారు.
 
 
 కొన్ని ఎన్‌కౌంటర్ల చిత్రీకరణ సింపుల్‌గా, కొండొకచో సిల్లీగా అనిపిస్తే ప్రేక్షకుల తప్పు కాదు. ఇక, ఫస్టాఫ్‌లో కీలకంగా కనిపించిన వీరప్పన్ భార్య వ్యవహారం సెకండాఫ్‌లో ప్రస్తావనకే రాదు. శ్రీయ పాత్ర గ్లామర్ అద్దడానికే. ఆ పాత్ర ఉన్నట్లుండి పోలీసుల ఇన్ఫార్మర్ అవడం, ఆనక హీరోతో చేరి తుపాకీ పట్టి, వీరప్పన్‌పై విరుచుకుపడడం కన్విన్సింగ్ కాకున్నా సర్దుకోవాలి అంతే! ఒకరికి నలుగురు మ్యూజిక్ డెరైక్టర్లున్న ఈ చిత్రంలో- పాటల్లో సాహిత్యమేమో కష్టపడినా వినపడకా, పాత్రధారుల డబ్బింగ్ మాటలేమో వినపడీ కష్టపెడతాయి. రోలింగ్ టైటిల్స్‌లో కన్నడ గీతాల వివరాలే కనిపించినా పట్టించుకోకూడదు. దర్శకుడిలానే ప్రేక్షకుడూ వీరప్పన్ వేట మీదే దృష్టి పెట్టాలి.
 
 
 టైటిల్‌రోల్‌లో ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ పట్టభద్రుడు సందీప్ భరద్వాజ్  నటన, నడక, కొండలు - గుట్టల్లో రియలిస్టిక్ ప్రవర్తన చూస్తే, వీరప్పన్‌నే చూస్తున్నామనిపిస్తుంది. అతని ఎంపికనూ, మేకప్ (విక్రమ్ గైక్వాడ్), కాస్ట్యూవ్‌ు్స నిపుణుల పనితనాన్నీ కూడా మెచ్చుకోవాలి. పేలుడు ధూళిలో వీరప్పన్ పరుగు దృశ్యాన్ని ఎఫెక్టివ్‌గా తీశారు. వీరప్పన్‌ను మట్టుపెట్టే ప్రయత్నంలో వీలైనన్ని గెటప్స్‌తో శివరాజ్ కుమార్‌ను మాస్ మెచ్చేలా చూపారు.
 
 
 ఏరియల్ షాట్స్‌తో చూపే ఎర్రదిబ్బల దగ్గర కాల్పుల ఘట్టం లాంటివి సినిమాటోగ్రఫీ వర్క్, అలెన్ అమీన్ యాక్షన్‌తో రక్తికట్టాయి. ఎక్కువగా కొన్ని పాత్రల మధ్యే, ఎంతసేపటికీ అక్కడక్కడే జరిగే ఈ సినిమా ఫస్టాఫ్ సో...సో.. అనిపించవచ్చు. కానీ, సెకండాఫ్ మొదలైన కాసేపటికి స్పీడ్ అందుకుం టుంది. ఎర్రదిబ్బల ఎపి సోడ్ నుంచి చివరి అరగంట ఉద్విగ్నభరితమే. వర్మ శైలి సినిమా, అందులోనూ ఇలాంటి సినిమా కాబట్టి క్రైమ్‌వాచ్‌లు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌‌స ఇష్టపడేవారికి ఇది మంచి అనుభూతినిస్త్తుంది.
 
  రెండున్నర గంటల టైమ్ కిల్లింగ్‌కూ ఈ సినిమా బాగుంటుంది. ‘ఐస్‌క్రీవ్‌ు’, ‘365 డేస్’ లాంటి చిత్రాలతో మసక బారుతున్న వర్మ మళ్ళీ పుంజుకోవడానికి ఇది టైవ్‌ులీగా కలిసొచ్చింది. రీరికార్డింగ్ ఆర్భాటంతో పాటు ఆడియన్స్ ఫీలయ్యే ఎమోషన్లపై దృష్టి పెట్టి ఉంటే, వర్మకు మరో క్లాసిక్కయ్యేది. వెరసి, వీరప్పన్‌పై కొన్ని మంచి సినిమాలు ఆల్రెడీ వచ్చేశాక, ఇది కన్నడిగులకు నచ్చేలా వర్మ తీసిన ‘శివరాజ్ కుమార్స్... కిల్లింగ్ వీరప్పన్’! వీరప్పన్ చేతిలో కన్నడిగుల ఆరాధ్యదైవం రాజ్‌కుమార్ రియల్ లైఫ్‌లో కిడ్నాపయ్యారు కాబట్టి, ఆయన కుమారుడు శివరాజ్ కుమార్ చేతిలో రీల్ లైఫ్‌లో ఇప్పుడీ వీరప్పన్ మరణం రామ్‌గోపాల్ వర్మ తెలివిగా చేసిన బాక్సాఫీస్ జస్టిస్.                    
                         - రెంటాల జయదేవ