అదే నా లక్ష్యం 

15 Jul, 2020 03:30 IST|Sakshi

‘‘నాది వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి. సినిమాల్లో నటించాలనే ఆసక్తి 2016లో కలిగింది. ఏడు షార్ట్స్‌ ఫిల్మ్స్‌లో నటించిన తర్వాత ఇక సినిమాలు చేద్దామనుకున్నా. ఆ సమయంలో డైరెక్టర్‌ రవికిరణ్‌ కోలాతో ఏర్పడిన పరిచయంతో ‘రాజావారు రాణిగారు’ చిత్రం చేశా’’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు.  నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ ‘‘నటుడిగా నా మొదటì  పుట్టినరోజు ఇది. ఈ సందర్భంగా నా కొత్త సినిమా ‘సెబాస్టియన్‌’ని ఈరోజు ప్రకటిస్తున్నాం. బాలాజీ అనే కొత్త అతను దర్శకత్వం వహిస్తారు.

ప్రస్తుతం నేను హీరోగా ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’ సినిమా నిర్మిస్తున్న ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంలోనే ప్రమోద్, రాజుగార్లు ఈ సినిమాని కూడా నిర్మిస్తారు. కల్యాణ మండపం నేపథ్యంలో ‘ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం’ సినిమా ఉంటుంది. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. 1975 అని పెట్టడానికి కారణం కల్యాణ మండపం ఆ టైమ్‌లో కట్టిందని చెప్పడానికే. లవ్‌స్టోరీ, తండ్రీ కొడకుల మధ్య బంధం, స్నేహం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్న చిత్రమిది. ఇందులోని పాత్రలన్నీ కడప జిల్లా యాసలోనే మాట్లాడతాయి. ఈ సినిమా చిత్రీకరణ అంతా కడప జిల్లాలోనే ప్లాన్‌ చేశాం. నిర్మాతలు బాగా సపోర్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికి 40 శాతం అయ్యింది. లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయింది.

ఈ సినిమా షూటింగ్‌లో సాయికుమార్, తనికెళ్ల భరణిగార్ల నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రదర్శకుడు శ్రీధర్‌కి ఇది తొలి సినిమా. ముందు ‘1991’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీశాడు. నాలుగేళ్లుగా కలసి ప్రయాణం చేస్తున్నాం. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ నేనే రాశాను. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ చేతన్‌ భరద్వాజ్‌గారు మా చిత్రానికి 6 మంచి పాటలిచ్చారు. అన్ని పాటలూ భాస్కరభట్లగారు రాశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘హీరోలు కృష్ణ, చిరంజీవిగార్లు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు. వాళ్లలా మంచి నటుడనిపించుకోవాలనుకుంటున్నాను. ఏ పాత్ర అయినా పోషించగలననే పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం’’ అన్నారు కిరణ్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా