అందుకే కొత్తవాళ్లను తీసుకుంటా

13 Mar, 2018 00:16 IST|Sakshi
అనిల్‌ సుంకర

‘‘నేను దర్శకుణ్ణి అవ్వాలనే ఇండస్ట్రీకొచ్చా. కానీ, డైరెక్టర్‌గా విఫలమయ్యా. నిర్మాతగా సక్సెస్‌ అయ్యా. అందుకే నిర్మాతగా ఉండటమే ఇష్టం’’ అన్నారు అనిల్‌ సుంకర. నిఖిల్‌ హీరోగా, సంయుక్తా హెగ్డే, సిమ్రన్‌ పరింజ   హీరోయిన్స్‌గా శరన్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘కిరాక్‌ పార్టీ’ ఈ నెల 16న విడుదలకానుంది. నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ–‘‘ నాకు ఎప్పటి నుంచో ‘శివ’ లాంటి సినిమా చేయాలని ఆశ. కన్నడ ‘కిరిక్‌ పార్టీ’ కథాంశం ‘శివ’ చిత్రానికి కొంత దగ్గరగా ఉండటంతో ‘కిరాక్‌ పార్టీ’ గా తెలుగులో రీమేక్‌ చేశా. ఈ చిత్రానికి తొలుత  దర్శకునిగా రాజుసుందరం అనుకున్నాం.

ఆయన తెలుగు, తమిళ భాషల్లో చేద్దామన్నారు. రెండు భాషల్లో ఒకేసారి ఫోకస్‌ చేయలేమని శరన్‌కి అవకాశం ఇచ్చాం. చాలా మంది కుర్రాళ్లు పల్లెటూరి నుంచి ఇంజనీరింగ్‌ చేయడానికి సిటీకొస్తారు. మొదటి సంవత్సరం భయంగా ఉంటారు. చివరి సంవత్సారానికి పూర్తీగా మారిపోతారు. అదెలా అన్నదే కథాంశం. మా సినిమాల్లో కొత్త వాళ్లను ఎక్కువగా తీసుకోవడానికి కారణం రెమ్యునరేషన్‌ తక్కువనే(నవ్వుతూ). ఫ్రెష్‌నెస్‌ కోసమే కొత్త వాళ్లను తీసుకుంటాం. శర్వానంద్‌– ‘దండుపాళ్యం’ డైరెక్టర్‌ శ్రీనివాసరాజుతో ఓ సినిమా అనుకున్నాం. కథ పూర్తయ్యాక వివరాలు చెబుతా’’ అన్నారు.

మరిన్ని వార్తలు