అదే నిజమైన చాలెంజ్‌

8 Dec, 2018 01:45 IST|Sakshi
కె.ఎల్‌.ఎన్‌.రాజు

‘‘అనగనగా ఒక రోజు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ వంటి చిత్రాలు నిర్మించిన కె.ఎల్‌.ఎన్‌.రాజు తాజాగా రూపొందించిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్‌ జె.అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకత్వంలో థౌజెండ్‌ లైట్స్‌ మీడియా పతాకంపై కె.ఎల్‌.ఎన్‌. రాజు నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా  కె.ఎల్‌.ఎన్‌.రాజు మాట్లాడుతూ– ‘‘సినీ ఫైనాన్షియర్‌గా నేను అందరికీ తెలుసు. 40ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉంటున్నా.

నిర్మాణం వైపు వెళ్లాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఇతర వ్యాపారాలు, వ్యాపకాల వల్ల ప్రొడక్షన్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. నాకు క్యూట్‌ లవ్‌ స్టోరీలంటే ఇష్టం. కథ నచ్చడంతోనే ‘అనగనగా ఓ ప్రేమకథ’ సినిమా తీశా. టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా అది మన ఫైవ్‌ సెన్స్‌కి లోబడే ఉండాలి. అలా కాకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పే కథాంశమిది. కె.సి. అంజన్‌ మంచి మెలోడి పాటలిచ్చాడు. ‘అనగనగా ఒక రోజు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అనగనగా ఓ ప్రేమ కథ’... ఇలా మా టైటిల్స్‌ ‘అ’తో స్టార్ట్‌ అవుతున్నాయి. అయితే ‘అ’ సెంటిమెంట్‌ ఏమీ లేదు. పెద్ద సినిమాలు, మల్టీస్టారర్స్‌ తీయటం కంటే చిన్న సినిమాలు తీయడంలోనే నిజమైన చాలెంజ్, సంతృప్తి ఉంటాయి’’ అన్నారు.

మరిన్ని వార్తలు