ఒక్కరు కాదు ముగ్గురు

24 Sep, 2018 01:01 IST|Sakshi
ఇషికా సింగ్, సంపూర్ణేష్‌ బాబు

‘హృదయ కాలేయం’ ఫేమ్‌ సంపూర్ణేష్‌ బాబు హీరోగా రూపక్‌ రొనాల్డ్‌సన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఇషికా సింగ్, గీతాంజలి కథానాయికలు. ఆది కుంభగిరి, సాయిరాజేష్‌ నీలం నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 14న విడుదలవుతోంది. ఈ చిత్రం సాంగ్‌ టీజర్‌ను ‘బిగ్‌ బాస్‌ 1’ కంటెస్టెంట్‌ల మధ్య హైదరాబాద్‌లో విడుదల చేశారు. డైరెక్టర్‌ రూపక్‌ రొనాల్డ్‌సన్‌ మాట్లాడుతూ– ‘‘కొబ్బరిమట్ట’ చిత్రం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఒక సంపూర్ణేష్‌ని చూస్తేనే కామెడీ ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇందులో ముగ్గురు సంపూర్ణేష్‌లుంటారు’’ అన్నారు.

‘‘కొబ్బరిమట్ట’ సినిమా రిలీజ్‌ రోజున సంపూర్ణేష్‌బాబు, సాయిరాజేశ్‌తో ‘సంపూ ఇన్‌ అమెరికా’ అని ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణారావు.‘‘హృదయ కాలేయం’ సినిమా టైమ్‌లో మేం ఎదగాలని అందరూ సపోర్ట్‌ చేశారు. అయితే ‘కొబ్బరిమట్ట’ చిత్రానికి మూడేళ్ల పాటు చాలా సమస్యలు ఎదుర్కొని అధిగమించాం’’ అన్నారు నిర్మాత సాయి రాజేష్‌. ‘‘మిట్టపల్లె అనే చిన్న ఊరు నుంచి నన్ను తీసుకొచ్చి రాజేష్‌ అన్న ‘హృదయ కాలేయం’ సినిమా చేశాడు. ఇప్పుడు ‘కొబ్బరి మట్ట’ సినిమాకి కూడా తనే నిర్మాత. ఆయన వెనక నిలబడి ఎన్ని రోజులైనా సపోర్ట్‌ అందిస్తాను’’ అన్నారు సంపూర్ణేష్‌ బాబు. భరత్, అజయ్, కత్తి కార్తీక, సమీర్, ముమైత్‌ ఖాన్, మధుప్రియ, రైటర్‌ కిట్టు, అనురాగ్, సౌమ్య వేణుగోపాల్, శ్రవణ్, సాయిబాలాజీ, ధనరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు