వారి చిత్రాల విడుదలే ఓ పండుగ!

17 Nov, 2016 04:22 IST|Sakshi
వారి చిత్రాల విడుదలే ఓ పండుగ!

పండుగ రోజుల్లో పెద్ద హీరోల చిత్రాల విడుదల అవసరం లేదని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు పార్తిబన్ వ్యాఖ్యానించారు. కథై తిరైకథై వచనం ఇయక్కం వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన కీలక పాత్రలో నటిస్తూ దర్శక నిర్మాణ బాధ్యతలు, నిర్వహిస్తున్న చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగ. పది మంది ఫండింగ్ నిర్మాతలతో కలిసి రీల్ ఎస్టేట్ కంపెనీ ఎల్‌ఎల్‌పీ, బైయోస్కోప్ ఫిలిం ఫ్రేమ్స్ సంస్థలపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఆయన చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దర్శక నటుడు కే.భాగ్యరాజ్ వారసుడు, యువ నటుడు శాంతను కథానాయకుడిగా పార్వతీనాయర్ నాయకిగా నటించిన ఈ చిత్రంలో తంబిరామయ్య, సింగంపులి, ఆనవి ముఖ్య పాత్రలు పోషించారు.

పార్తిబన్ కీలక పాత్రలోనూ, నటి సిమ్రాన్, అరుణ్‌విజయ్ అతిథి పాత్రల్లోనూ నటించిన ఈ చిత్రానికి అర్జున్ జెనా ఛాయాగ్రహణం, సత్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను పార్తిబన్ తెలియజేస్తూ కథై తిరైకథై వచనం ఇయక్కం చిత్రాన్ని చూసిన కొందరు కాస్త కన్‌ఫ్యూజన్‌గా ఉందని అన్నారన్నారు.అరుుతే ప్రేక్షకులు చాలా తెలివిగా ఉన్నారని, వారు ఆ చిత్రాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ చిత్రం ఇచ్చిన ధైర్యంతోనే ఈ కోడిట్ట ఇడంగళై నిరంపుగ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ఏ ఫిలిం విత్ మిస్టెక్స్ అనే టాగ్‌ను పెట్టినట్లు తెలిపారు. చిత్రంలో ముద్దు సన్నివేశాలు ఉన్నట్లున్నాయన్న ప్రశ్నకు ముద్దు సన్నివేశాలే కాదు మొత్తం రొమాన్‌‌స సన్నివేశాలతో చిత్రం యమ కిక్ ఇస్తుందని బదులిచ్చారు.

ఒక శిష్యుడిగా తన గురువు కే.భాగ్యరాజ్‌కు ఏదైనా చేయాలనుకున్నానని, అందులో భాగంగా ఆయన వారసుడు శాంతనును ఈ చిత్రంలో హీరోగా తీసుకున్నానని తెలిపారు. ఇది తనకు మంచి టేకాఫ్ ఆరుుతే తనకంటే సంతోషించేవారెవరూ ఉండరని పేర్కొన్నారు. ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ నాలుగవ తేదీన, చిత్రాన్ని అదే నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మండలికి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానన్నారు. పండగల సందర్భాల్లో పెద్ద హీరోల చిత్రాలు విడుదలవ్వాల్సిన అవసరం లేదన్నారు.వారి చిత్రాల విడుదలే పండగ అని, అందువల్ల ఆ సందర్భాల్లో చిన్న చిత్రాల విడుదలకు అవకాశం ఇస్తే చిన్న నిర్మాతలు నాలుగు డబ్బులు సంపాదించుకుంటారని పార్తిబన్ అన్నారు.