రేంజర్‌గా సిబిరాజ్‌

5 Sep, 2019 10:45 IST|Sakshi

యువ నటుడు సిబిరాజ్‌ ఇప్పుడు రేంజర్‌గా మారనున్నారు. అవును ఈయన నటించనున్న నూతన చిత్రానికి రేంజర్‌ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పలు చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేసిన ఆరా సినిమాస్‌ సంస్థ అధినేత మహేశ్‌.జీ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇంతకుముందు బర్మా, రాజారంగూష్కీ, జాక్సన్‌దురై చిత్రాలను తెరకెక్కించిన ధరణీధరణ్‌ దర్శకత్వం వహించనున్నారు‌. ఈ చిత్ర టైటిల్‌ను మంగళవారం చిత్ర యూనిట్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా నిర్మాత మహేశ్‌.జీ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది మహారాష్ట్రలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించనున్న చిత్రం అని చెప్పారు. ఈ మధ్య మహారాష్ట్రలోని యావత్మాల్‌ అనే జిల్లాలో ఆవ్నీ అనే పులి మనుషులను ఎలా బలి తీసుకున్నదన్న విషయం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందేనన్నారు. ఆ సంఘటను ఆధారంగా చేసుకుని రేంజర్‌ పేరుతో చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో సిబిరాజ్‌ కథానాయకుడిగా నటించనున్నారని, ఆయనకు జంటగా నటి రమ్యానంబీశన్, మధుశాలిని నటించనున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు మనుషులపై దాడి చేసిన మృగాల ఇతివృత్తంతో పలు చిత్రాలు వచ్చాయని, అయితే అవన్నీ కల్పిత కథా చిత్రాలని అన్నారు. తమ చిత్రం మన దేశంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందనున్న చిత్రం అని చెప్పారు.

ఈ చిత్రానికి సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అధికంగా ఉంటుందని చెప్పారు. అందుకు హాలీవుడ్‌ సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు ధరణీధరణ్‌ కథ, కథనాన్ని వైవిధ్యంగా తీర్చిదిద్దారని చెప్పారు. థ్రిల్లర్‌తో కూడిన కమర్శియల్‌ కథా చిత్రంగా రేంజర్‌ ఉంటుందన్నారు. ఈ చిత్రానికి నటుడు సిబిరాజ్‌ పక్కాబలంగా ఉంటారని అన్నారు. ఆయన ఇమేజ్‌ను మరింత పెంచేదిగా రేంజర్‌ చిత్రం ఉంటుందని అన్నారు.

రేంజర్‌ ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తుందన్నారు. చిత్ర షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించి తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటించే ఇతర నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని, అదే విధంగా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. అరోల్‌ కరోలి సంగీతాన్ని, కల్యాణ వెంకట్రామన్‌ ఛాయాగ్రహణం అందించనున్నారని నిర్మాత తెలిపారు.

మరిన్ని వార్తలు