అంతకంటే గర్వంగా భావించే విషయం ఏముంటుంది?

9 Dec, 2018 10:39 IST|Sakshi

సమాజానికి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదని తమిళ హీరో జయంరవి వ్యాఖ్యానించారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన ఇటీవల టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంతో అలరించారు. తాజాగా అడంగమరు చిత్రంతో తెరపైకి రావడానికి సిద్ధం అయ్యారు. ఇది జయంరవి మామ సొంతంగా నిర్మిస్తున్న చిత్రం కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీక్‌ తంగవేల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా నాయకిగా నటించింది.  ఈ నెల 21న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు జయంరవితో సాక్షి చిట్‌చాట్‌.

అడంగమరు ఏ తరహా చిత్రంగా ఉంటుంది?
ఇది విభిన్నంగా సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుంది. 

చిత్రంలో మీ పాత్ర గురించి?
ఇందులో మరోసారి పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాను. ఇందులో సమాజానికి మంచి చేయాలనే ఒక సిన్సియర్‌ సీఐగా నటించాను. 

ఇది పూర్తి కమర్శియల్‌ కథా చిత్రం అంటున్నారు. మరి దీని ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు?
ఇప్పుడు దేశంలో జరుగుతున్న దారుణాల గురించి చూపిస్తున్నాం. అలాంటి సంఘటనలను ఎలా అరికట్టాలనే అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించాం.

నిజజీవితంలో అలాంటి సంఘటనలను అరికట్టడం సాధ్యమంటారా?
ప్రయత్నిస్తే అసాధ్యం అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. అప్పుడే దారుణాలను అరికట్టగలం. అందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

మీకు రాజకీయాల్లోకి వచ్చే అలోచన ఉందా?
అసలు లేదు. అయినా మంచి చేయడానికి రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదు. రజనీకాంత్, కమలహాసన్‌ వంటి వారు రాజకీయాల్లోకి వస్తున్నారుగా? అని మీరు అడగవచ్చు. వారు రాజకీయాల ద్వారానే ప్రజలకు మంచి చేయవచ్చునని భావిస్తున్నారేమో. నేను చెప్పేది నా వ్యక్తిగత అభిప్రాయం.

అడంగమరు చిత్రంలో హీరోయిన్‌ రాశీఖన్నా పాత్ర గురించి?
ఆమెది చాలా మంచి పాత్ర. ఇంటీరియర్‌ డిజైనర్‌గా నటించింది. 

దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి డాక్యుమెంటరీని ఇటీవల ఒక చానల్‌లో ప్రసారమైంది. అందులో జయలలిత నాకు నచ్చిన చిత్రం దీపావళి అని,  ఈతరం యువ నటుల్లో జయంరవి అంటే ఇష్టం అని పేర్కొన్నారు. దీనిపై మీ స్పందన?
అంతకంటే గర్వంగా భావించే విషయం ఏముంటుంది? చాలా సంతోషం. 

జయలలితను ఎప్పుడైనా స్వయంగా కలిశారా?
ఒకసారి కుటుంబసభ్యులతో కలిసి జయలలిత ఇంటికి వెళ్లాను. నాకు అప్పుడు చిన్న వయసు. మేడమ్‌ మీ ఇల్లు చాలా బాగుంది అని అనేశాను. అందుకామె థ్యాంక్స్‌ అని అన్నారు. ఆ తరువాత సంతోష్‌ సుబ్రమణియం చిత్ర విజయోత్సవ వేడుకలో జయలలిత చేతుల మీదగా జ్ఞాపికను అందుకున్న క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను.

జయలలిత బయోపిక్‌ చిత్రంలో ఎంజీఆర్‌ పాత్రలో నటించే అవకాశం మీకు వస్తే ఎంజీఆర్‌గా నటిస్తారా?
అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను.

మీ అబ్బాయి ఆరవ్‌ టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంలో బాల నటుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నాడు. తదుపరి మరే చిత్రంలోనూ నటించలేదే?
నిజం చెబుతున్నా. టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రం తరువాత ఆరవ్‌కు 25 చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే తన వయసు 9 ఏళ్లే. ఇప్పటి నుంచే నటిస్తూ పోతే చదువుకు అంతరాయం కలుగుతుంది.అందుకే 18,19 ఏళ్ల వరకూ పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాం. ఆ తరువాత ఆరవ్‌ ఇష్టపడితే నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు.

మరిన్ని వార్తలు