నన్ను చాలెంజ్‌ చేసిన స్కిప్ట్ర్‌ నిశ్శబ్దం

3 Dec, 2019 00:11 IST|Sakshi
వివేక్‌ కూచిభొట్ల, వందన, విశ్వప్రసాద్, హేమంత్‌ మధుకర్, కోన వెంకట్, సుబ్బరాజు

– కోన వెంకట్‌

‘‘కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు. ‘నిశ్శబ్దం’ కథ హేమంత్‌ రూపంలో నా దగ్గరకు వచ్చింది. కథలు మనల్ని కదిలిస్తే సినిమాలు అవుతాయి. అందరూ అనుకుంటున్నట్టు ఇది మూకీ సినిమా కాదు. సంభాషణలు ఉంటాయి’’ అన్నారు కోన వెంకట్‌. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్‌ మ్యాడిసన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కోన వెంకట్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ప్రారంభయ్యే ముందు అనుకోని సంఘటనలు జరిగాయి. ముందు అనుష్క కాకుండా వేరే హీరోయిన్‌ అనుకున్నాం. సినిమా షూటింగ్‌ ఆలస్యం కావడంతో ఆమె ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అనుష్క ఫ్లైట్‌లో కలసినప్పుడు ఈ కథ విని సినిమా చేశారు. హేమంత్, నేను ఒక యజ్ఞంలా ఈ సినిమా చేశాం. సినిమాలో అందరూ పాత్రలే. హీరో, హీరోయిన్లు ఉండరు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించాం. మలయాళ, హిందీ భాషల్లో డబ్బింగ్‌ చేసి రిలీజ్‌ చేస్తాం. రచయితగా నన్ను చాలెంజ్‌ చేసిన స్కిప్ట్ర్‌ ‘నిశ్శబ్దం’.

అనుష్క పాత్ర మాట్లాడలేదు కాబట్టి ‘నిశ్శబ్దం’ అని టైటిల్‌ పెట్టాం’’ అన్నారు. ‘‘హేమంత్‌ నాకు 15 ఏళ్లుగా స్నేహితుడు. ఈ కథను నేను కూడా ఫ్లైట్‌లోనే విన్నాను. ఇందులో చాలా డిఫరెంట్‌ రోల్‌ చేశాను’’ అన్నారు సుబ్బరాజు. ‘‘మంచి సినిమా. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు వివేక్‌ కూచిభొట్ల. ‘‘టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాషన్‌. హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమా చేయాలకునేవాణ్ణి. ఈ సినిమా హాలీవుడ్‌ స్టయిల్లో ఉంటుంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. ‘‘టెక్నికల్‌గా ఇది కొత్త చిత్రం. ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ అవుతుందనుకుంటున్నాను. విశ్వప్రసాద్‌గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం’’ అన్నారు హేమంత్‌.

మరిన్ని వార్తలు